అభిషేక్ పై బిగ్ బి స్వారీ
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/paa.jpg' align='right' alt=''>పాత్రలు తారుమారు అయ్యాయి. నిజజీవితంలో తండ్రికొడుకులైన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు ఇప్పుడు వెండితెరపై ఇందుకు పూర్తి భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. 'పా' చిత్రం కోసం అభిషేక్ బచ్చన్ తండ్రి పాత్రలోనూ, ఆయన కొడుకు పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. ఇందులో అమితాబ్ బుద్ధిమాంద్యం ఉన్న 12 ఏళ్ల కుర్రాడుగా కనిపించబోతున్నారు. చిన్నప్పుడు అభిషేక్ ను ఉప్పుమూటలా వీపుపై ఎక్కించుకుని అమితాబ్ ఆడించారో లేదో కానీ అభిషేక్ మాత్రం 'పా' చిత్రం కోసం బిగ్ బిని వీపు మీద ఎక్కించుకుని పంటపొలాల మధ్య పరుగులెత్తారు. ఆరున్నర అడుగులు పైబడిన అమితాబ్ ను జూనియర్ బచ్చన్ మోయడమంటే ఎంత కష్టమో ఎవరైనా ఊహించొచ్చు. అయితే ఇటీవల ఈ సన్నివేశాన్ని అభిషేక్ ఎంతో సునాయాసంగా రక్తికట్టించినట్టు చిత్ర దర్శకుడు ఆర్.బల్కి తెలిపారు.
'అమితాబ్ ను వీపు మీద ఎక్కించుకుని సువిశాలమైన పొలాల్లో ఎక్కడా ఆగకుండా అభిషేక్ మోసుకెళ్లారు. సింగిల్ టేక్ లో ఈ సన్నివేశం చేశారు. ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి సమీపంలో ఉన్న బరీ సెయింట్ ఎడ్మండ్స్ వద్ద ఈ సన్నివేశం చిత్రీకరించాం' అని బల్కి వివరించారు. విశాలమైన పొలాలు ఉండటంతో పాటు ఎక్కువ సంఖ్యలో అక్కడి ఇండియన్స్ గుమిగూడకుండా ఉండేందుకు ఈ ప్రాంతాన్ని దర్శకుడు ఎంచుకున్నారు. సొంత కొడుకే వీపు మీద ఎక్కించుకుని తిప్పడం ఎలాంటి అనుభూతిని కలిగించిందని అమితాబ్ ను అడిగినప్పుడు 'నన్ను వీపు మీద ఎక్కించుకుని తిప్పడం అతని పని' అని చెబుతూనే...'జయ-నేనూ కలిసి ఓ బలిష్టమైన కుర్రాడ్ని కన్నాం' అంటూ చిరునవ్వులు చిందించారు. ఈ చిత్రంలో 12 ఏళ్ల బాలుడిగా కనిపించేందుకు మేకప్ విషయంలో తాను పడిన కష్టాన్ని వివరిస్తూ, ప్రతిరోజూ ఉదయం తినడానికి కానీ, తాగడానికి కూడా వెళ్లకుండా కనీసం నాలుగైదు గంటలు మేకప్ కోసం కూర్చోవలసి వచ్చేదనీ, సూర్యోదయం వేళం షూటింగ్ జరపాల్సి వచ్చినప్పుడు ముందు రోజు రాత్రి 11 గంటలకు లేచి మేకప్ కోసం కూర్చోవలసి వచ్చేదనీ చెప్పారు. ఈ చిత్రం అమితాబ్ కు చెందిన ఎబి కార్పొరేషన్ లిమిటెడ్ సమర్పణలో రూపొందుతోంది.
News Posted: 6 November, 2009
|