లలితాకుమారి రీఎంట్రీ
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/lalitakumari.jpg' align='right' alt='Lalitakumari'>ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తో గత వారం 'విడాకుల ఒప్పందం' కుదరడంతో కోర్టుకు హాజరైన ఆయన భార్య లలితాకుమారి ఇప్పుడు తిరిగి కెమెరా ముందుకు రానుంది. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఆమె ముఖానికి మేకప్ వేసుకోనుండటం ఇదే ప్రథమం.
అలనాటి నటుడు సిఎల్ ఆనంద్ కుమార్తె, శాంతి శ్రీహరి సోదరి అయిన లలితాకుమారి తమిళ ప్రేక్షకులకు నటిగా సుపరిచితురాలు. కె.బాలచందర్ 'మనదిల్ ఉరుది వేండ్రుం' చిత్రం ద్వారా నటిగా పరిచయమైన లలితాకుమారి 'పులన్ విసరనై', 'మాపిళ్లై' వంటి సుమారు 30 చిత్రాల్లో నటించింది. ప్రకాష్ రాజ్ తో వివాహనంతరం ఆమె గృహిణిగా స్థిరపడ్డారు. త్వరలోనే విడాకులు మంజూరు కానున్న నేపథ్యంలో ఆమె నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఆసక్తికరంగా ఈ ఇన్నింగ్స్ లోనూ ఆమె కె.బాలచందర్ నిర్మాణ సంస్థ అయిన కవితాలయ బ్యానర్ లో నటించనున్నారు. 'మురియాది' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వ దర్శకుడు. గణేష్ వెంకట్రామన్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సత్యరాజ్ కు జోడిగా కామెడీ పాత్రను లలితాకుమారి పోషించనున్నారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరిస్తూ 'మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతుండటం, అదికూడా బాలచందర్ సార్ తీస్తున్న సినిమా కావడం చాలా గర్వంగా ఉంది. తమిళంలో కామెడీ నటీమణుల కొరత ఉందని నా అభిప్రాయం. కోవై సరళ మిగతా భాషల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ తరహా పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను' అని చెప్పారు.
News Posted: 16 November, 2009
|