రణ్ బీర్ తో వర్మ చిత్రం
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/varma-ranabhir.jpg' align='right' alt=''>బాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ పై కన్నేసిన రణ్ బీర్ కపూర్ ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కలుసుకున్నారు. దీంతో రణ్ బీర్ హీరోగా 'సర్కార్-3' (సర్కార్ సిరీస్) చిత్రాన్ని తీసే ఆలోచనలోనే వర్మ ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలను వర్మ ఖండించారు. రణ్ బీర్ ను కలుసుకున్న మాట నిజమేననీ, ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశాలపై మాత్రమే ముచ్చటించామనీ ఆయన వివరణ ఇచ్చారు. 'సర్కార్-3' ముచ్చట లేనేలేదనీ, భవిష్యత్తులో కూడా 'సర్కార్' ఫిలిమ్స్ (సీక్వెల్స్) తీసే యోచన లేదనీ ఆయన స్పష్టం చేశారు.
అభిషేక్ బచ్చన్, అమితాబ్ లతో వర్మ తొలిసారిగా 2005లో సర్కార్ చిత్రాన్ని నిర్మించారు. దీనికి సీక్వెల్ గా మళ్లీ ఇదే కాంబినేషన్ లో 2008లో 'సర్కార్ రాజ్' తీశారు. అందులో ఐశ్వర్యారాయ్ కూడా నటించారు. దీనికి మరో సీక్వెల్ ఎంతమాత్రం లేదని వర్మ తేల్చిచెప్పారు. 'ఒక విషయం నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. సర్కార్-3 అనేది లేదు. సర్కార్ రాజ్ తోనే ఆ సిరీస్ ముగిసింది. బచ్చన్లు లేకుండా సర్కార్ సిరీస్ ఉండదు. ఊహించలేం కూడా' అని వర్మ చెప్పారు. ప్రస్తుతం చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన తర్వాత రణ్ బీర్ తో 'రంగీలా' తరహా లో ఓ ప్రేమకథా చిత్రాన్ని తీయాలనే ఆలోచలో వర్మ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'రక్తచరిత్ర' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మీడియా, సొసైటీలోని పరిణామాలపై 'రణ్' చిత్రం తీస్తున్నారు. 'ఫూంక్' చిత్రానికి సీక్వెల్ కూడా చేస్తున్నారు. దీనికి వర్మ శిష్యుడు మిలంద్ గడాక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'రణ్', 'రక్తచరిత్ర' చిత్రాలలో ప్రస్తుతం తాను బిజీగా ఉన్నాననీ, ఫూంక్ చిత్రానికి పనిచేసిన మిలంద్ 'ఫూంక్-2' చిత్రానికి పనిచేస్తున్న విషయం నిజమనీ వర్మ వివరించారు.
News Posted: 23 November, 2009
|