కత్రిన-అక్షయ్ వానపాట కట్!

కరీనా కపూర్ తన బాయ్ ఫ్రెండ్ అలీఖాన్ లో వేడి పుట్టిస్తూ వీపు నగ్నంగా చూపించే 'కుర్బాన్'లోని హాట్ సన్నివేశం 'సేన' ఆగ్రహానికి గురి కావడం ఆ చిత్రానికి మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు కోర్టు జోక్యంతో సినిమా రిలీజ్ అయి ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పుడు ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఆ తర్వాత ముచ్చట 'దే దనా దన్'దే. ఈ చిత్రంలోని ప్రధాన జంట అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ పై చిత్రీకరించిన ఓ వర్షం పాటకు సంబంధించిన క్లిప్పింగ్స్, పబ్లిసిటీ స్టిల్స్ కొద్దిరోజులుగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇందులో కత్రిన తడిపొడి అందాలను ప్రదర్శిస్తుండగా ఆమెను అక్షయ్ కుమార్ తమకంతో హత్తుకుంటారు. బాలీవుడ్ లో ఇప్పటికే ఈ ఇద్దరికీ 'హాట్ అండ్ హిట్ పెయిర్' అనే పేరుండగా...పక్షం రోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ వాన పాట స్టిల్స్ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచాయి. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన పరిణామం చేటుచేసుకుంది. ఆ వాన పాటను సినిమా నుంచి తొలగించడానికే దర్శకుడు ప్రియదర్శన్ నిశ్చయించుకున్నారట. చివరి నిమిషంలో దర్శకుడు తీసుకున్న ఈ నిర్ణయం ఇటు కత్రినా, అటు కత్రినకు ససేమిరా ఇష్టంలేదట.
సినిమా క్లైమాక్స్ కు ముందు ఈ సాంగ్ వస్తుందనీ, ఇందువలన సినిమాలోని టెంపో తక్కుతుందనీ,. సినిమా లెంగ్త్ కు కూడా విఘాతం కలిగించే అవకాశం ఉందని ప్రియదర్శన్ భావించినట్టు యూనిట్ వర్గాల కథనం. అయితే ఈ నిర్ణయం పట్ల అక్షయ్, కత్రినా హ్యాపీగా లేరనీ, బాలీవుడ్ లో తాను తొలిసారి నటించిన వాన పాట కావడంతో దానిని తొలగించవద్దని ప్రియదర్శన్ కు కత్రినా రిక్వెస్ట్ చేసిందనీ వారంటున్నాయి. సినిమా బాగా ఆడినట్లయితే ఆ తర్వాత క్రమంలో తప్పనిసరిగా పాటను జోడిస్తానని ఆయన కత్రినకు హామీ ఇచ్చారట. మొత్తానికి మంచి పబ్లిసిటీ చూరగొన్న వాన పాటపై ప్రియదర్శన్ మనసు మార్చుకుని ఆ పాటకు ఆదిలోనే చోటు కల్పిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈ శుక్రవారమే (27) 'దే దనా దన్' విడుదలవుతోంది.
News Posted: 26 November, 2009
|