'కాంచీవరం' క్లీన్ స్వీప్

ముంబై: జాతీయ ఉత్తమ చిత్రం (2008), ఉత్తమ నటుడు అవార్డులను అందుకున్న 'కాంజీవరం' చిత్రం 2007 సంవత్సరానికి ప్రతిష్టాత్మక వి.శాంతారావు అవార్డులను నాలుగు కేటిగిరిలలో గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. ముంబైలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటుడు అవార్డును ప్రకాష్ రాజ్ (కాంజీవరం), ఉత్తమ నటి అవార్డును రాణీ ముఖర్జీ (దిల్ బోలే హడిప్పా) అందుకున్నారు.
ఉత్తమ చిత్రంగా 'కాంచీవరం' అవార్డును అందుకోగా, ఇదే చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడుగా ప్రియదర్శన్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా తిరు అవార్డులను అందుకున్నారు. మరాఠీ చిత్రం 'గబ్రికా పాస్' ద్వితీయ ఉత్తమ చిత్రంగా, సైఫ్ అలీఖాన్ నిర్మించిన మొదటి చిత్రం 'లవ్ ఆజ్ కల్' తృతీయ ఉత్తమ చిత్రంగా అవార్డులు గెలుచుకున్నాయి. 'ఫిరాఖ్' చిత్రానికి తొలి చిత్ర దర్శకురాలిగా నందితా దాస్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును సందీప్ శ్రీవాత్సవ (న్యూయార్క్), బెస్ట్ ఒరిజనల్ స్కోర్ అవార్డును ప్రీతమ్ (లవ్ ఆజ్ కల్) అందుకున్నారు. దర్శకుడిగా తాను అందుకున్న తొలి అవార్డు ఇదనీ, ప్రస్తుతం తన 80వ చిత్రంగా 'కట్టా మీటా' రూపొందుతోందనీ ప్రియదర్శన్ తెలిపారు.
News Posted: 23 December, 2009
|