పది లక్షల 'జనగణమన'

హైదరాబాద్ : జాతీయ గీతంగా 'జన గణ మన' గుర్తింపు పొంది 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాని విశిష్టతను చాటేందుకు మ్యూజిగల్ డాట్ కాం, సామాజిక సేవా సంస్థ లీడ్ ఇండియా 2020తో ఓ కార్యక్రమం చేపట్టాయి. డిసెంబర్ 24 నుంచి ఫిబ్రవరి 24 వరకూ 60 రోజుల్లో పది లక్షల మందితో 'జన గణ మన' గేయాన్ని ఆలపింపచేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతం 'జన గణ మన'ను పాటి రికార్డ్ చేయాలని మ్యూజిగల్ సంస్థ సిఇఓ ఆనంద్ కూచిభొట్ల విజ్ఞప్తి చేశారు. http://leadindia2020.muzigle.comకు సొంత మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలని లేదా రిజిస్టర్ చేసుకోవడానికి ఏదైనా మెయిల్ ఐడి లేదా ఫేస్ బుక్ ఐడితో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావచ్చని ఆనంద్ తెలిపారు. లాగిన్ అయ్యాక 'Karoake Player'లోని జన గణ మన గీతాన్ని విని, సాధన చేసి, అనంతరం రికార్డు చెయ్యవచ్చని ఆనంద్ కూచిభొట్ల తెలిపారు. అయితే, రికార్డు చేసిన గీతాన్ని విని, సరిగ్గా రికార్డు అయితే సేవ్ చెయ్యవచ్చన్నారు. బంజారాహిల్స్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అందించిన స్ఫూర్తితో ప్రారంభమైన లీడ్ ఇండియా 2020 రెండో జాతీయ ఉద్యమం (అభివృద్ధి కోసం) ద్వారా చేపట్టిన కార్యక్రమాల గురించి సంస్థ జాతీయ కో ఆర్డినేటర్ సుదర్శనాచార్య తెలిపారు. లీడ్ ఇండియా 2020 సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. మ్యూజిగల్ ఇండియా ప్రెసిడెంట్, కో ఫౌండర్ షాన్ అప్పజోడు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ, జాతీయ పతాకం రూపకల్పన మన రాష్ట్రంలోనే జరిగిందని, జాతీయ గీతానికి స్వర రచన కూడా మన రాష్ట్రంలోని మదనపల్లిలో జరిగిందని తెలిపారు. జాతీయ గీతం 60 సంవత్సరాల వేడుక కూడా మన రాష్ట్రంలోనే ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 60 లక్షల మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జ్యోతి ప్రజ్వల, జాతీయ పతాక ఆవిష్కరణతో ప్రారంభమైన ఈ సమావేశంలో రామాచారి దేశభక్తి గీతాలు ఆలపించారు. విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత డి.జె. రమేష్, జస్టిస్ భాస్కర్ రావు, వి.వి. సన్యాసిరాజు, ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, సీనియర్ జర్నలిస్టు ప్రభు, పిఆర్వో డాక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
News Posted: 25 December, 2009
|