రెహ్మాన్ కు ట్రినిటీ ఫెలోషిప్
ఎ.ఆర్.రెహ్మాన్ ఎక్కడకు వెళ్లినా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. గత వారం జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో ఆయనపై ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసల జల్లు కురింపించారు. తాజాగా ఆయనకు లండన్ లోని ప్రఖ్యాత 'ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్' హానరరీ ఫెలోషిప్ ప్రదానం చేసింది. యుకెలోని గ్రీన్ విచ్ లో ఈనెల 16న జరిగిన ఓ కార్యక్రమంలో రాయల్ బాలే కన్వెంట్ గార్డెన్ మ్యూజిక్ డైరెక్టర్ బారీ వర్డ్స్ వత్ చేతుల మీదుగా రెహ్మాన్ ఈ పురస్కారం అందుకున్నారు. సంగీతం, కళారంగంలో చూపిన అసమాన ప్రతిభకు గుర్తింపుగా ఈ ఫెలోషిప్ ను రెహ్మాన్ కు ప్రదానం చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక వెబ్ సైట్ వెల్లడించింది.
రెహ్మాన్ గత సోమవారం న్యూ ఢిల్లీలో జరిగిన అవార్డుల సెర్మనీలో సిఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ -2009 అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. రెహ్మాన్ సంగీతం ఎంతో స్ఫూర్తినిస్తుందనీ, రెహ్మాన్ ఇటీవల వైట్ హౌస్ లో ఉన్నారని తనకు తెలిసినప్పుడు ఆయన అచీవ్ మెంట్ చూసి తనకెంతో ఆనందం కలిగిందని మన్మోహన్ ఈ సందర్భంగా ప్రశంసించారు.
News Posted: 28 December, 2009
|