'3 ఇడియట్స్' కు 100 కోట్లు
బాలీవుడ్ 'మిస్టర్ పెర్ ఫెక్ట్' అమీర్ ఖాన్ ఇటీవల తాను సాధించిన రికార్డును మళ్లీ బద్దలు కొట్టారు. 'గజనీ' చిత్రం రికార్డులను ఆయన తాజా చిత్రం '3 ఇడియట్స్' అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ కలుపుకొని కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ రెవెన్యూ రాబట్టుకుంది. అమీర్, మాధవన్, షర్మాన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో విధు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. గత రెండేళ్లుగా క్రిస్మస్ కి రిలీజ్ చేసిన 'తారే జమీన్ పర్', 'గజనీ' ఘనవిజయాలు సాధించడం, ఇప్పుడు మరోసారి క్రిస్మస్ సెంటిమెంట్ కలిసొచ్చి '3 ఇడియట్స్'తో హ్యాట్రిక్ సాధించడం అమీర్ ను సంబంరంలో ముంచెత్తుతోంది.
'3 ఇడియట్స్' చిత్రం ఇటు మల్టీప్లెక్స్ , అటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ద సంఖ్యలో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోందనీ, త్వరలోనే బాలీవుడ్ చరిత్రలోనే మరికొన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనీ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. బాలీవుడ్ లో ఇటీవలకాలంలో రిపీట్ ఆడియెన్స్ కరవైన నేపథ్యంలో మళ్లీ ఆలాంటి మ్యాజిక్ ను ఈ చిత్రం సృష్టిస్తోందని వారంటున్నారు. బాలీవుడ్ లో రికార్డు బిజినెస్ చేస్తున్న జేమ్స్ కామరన్ 'అవతార్' పై ఈ చిత్రం పైచేయి సాధించనుందనీ, త్వరలోనే ఈ చిత్రం వసూళ్లు 200 కోట్లకు చేరుకోనున్నాయనీ విశ్లేషకులు ఢంకా బజాయిస్తున్నారు.
News Posted: 29 December, 2009
|