విధు వినోద్ చోప్రా క్షమాపణ
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/VidhuVinodChopra.jpg' align='left' alt='Vidhu vinod chopra'>న్యూఢిల్లీ: నొయిడాలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో పాత్రికేయునిపై నోరుపారేసుకున్నందున '3 ఇడియట్స్' నిర్మాత విధు వినోద్ చోప్రా శనివారంనాడు క్షమాపణ చెప్పారు. తాను సిల్లీగా ప్రవర్తించాననీ, అది తన నైజం కూడా కాదనీ, ఇందుకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాననీ అన్నారు.
చేతన్ భగత్ రాసిన 'ఫైవ్ పాయింట్ సమ్ వన్' నవల నుంచే 70 శాతం సినిమా స్క్రిప్టు తయారు చేసినట్టు ఆయన స్వయంగా చేసిన ఆరోపణపై ఓ పాత్రికేయుడు చోప్రాను శుక్రవారంనాడు ప్రశ్నించినప్పుడు 'నువ్వు ఆ నవల చదివావా? నేను చదివాను. సో...షటప్' అంటూ ఊగిపోయారు. చోప్రా నోరుపారేసుకోవడాన్ని పాత్రికేయులు తప్పుపట్టారు. ప్రెస్ మీట్ లో పాల్గొన్న అమీర్ సైతం చోప్రాను శాంతపరచేందుకు ప్రయత్నించారు. సారీ చెప్పాలని సూచించారు కూడా. అందుకు చోప్రా నిరాకరించారు. అయితే శనివారం ఆయన పాత్రికేయులకు క్షమాపణ చెబుతూ, తాను ఆవేశపడినట్టు చూపించిన టీవీ ఫూటేజ్ చేసి తన తప్పేమిటో తెలిసిందనీ, అందుకే క్షమాపణ చెప్పాలని నిశ్చయించుకున్నాననీ అన్నారు. నిజానికి ప్రెస్ కాన్ఫరెన్స్ కు ముందే తాము కాన్సెర్ బాధితులైన కొందరు పిల్లల్ని కలుసుకున్నామనీ, వారిని చూసి తాను చలించిపోయాననీ అన్నారు. ఆ క్రమంలోనే చేతన్ భగత్ గురించి సదరు పాత్రికేయుడు రాజ్ కుమార్ హిరానీ (దర్శకుడు), అభిజిత్ జోషి (స్క్రిప్టు రచయిత)ని ప్రశ్నించడం మొదలుపెట్టడంతో తనను తాను అదుపు చేసుకోలేకపోయినట్టు వివరణ ఇచ్చారు. హిరానీ చాలా మంచి వ్యక్తి అనీ, ఆయనను ప్రశ్నించడం తనను ఆవేశానికి గురిచేసిందనీ అన్నారు. 'నేను చేసిన పని నాకూ కూడా నచ్చలేదు. ఇకముందు అలా జరగదు. నా కోపాన్ని అదుపుచేసుకుంటాను' అని ఆయన పేర్కొన్నారు.
News Posted: 2 January, 2010
|