రణ్ బీర్ తల్లిగా దీపిక
'రబ్ నే బనాది జోడి' చిత్రం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసినప్పటికీ దర్శక నిర్మాత యష్ చోప్రా మరోసారి 'రబ్ రఖా తే జగ్ రఖా' అనే మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, సైఫ్ అలీఖాన్, దీపిక పదుకునే, కత్రినా కైఫ్, రణ్ బీర్ కపూర్ వంటి హేమాహేమీలు నటించబోతున్నారు. అనూహ్యంగా ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ తల్లిగా దీపిక పడుకునే నటించనుందట.
గురుద్వార్ లో కీర్తన సింగర్లుగా పేరున్న మూడు జనరేషన్లకు చెందిన క్యారెక్టర్లతో ఈ చిత్ర కథాంశం ఉండబోతోంది. యష్ చోప్రా ఎంపిక చేసుకున్న క్యారెక్టర్ల పరంగా చూస్తే దీపిక పదుకునే తన మాజీ బాయ్ ఫ్రెండ్ రణ్ బీర్ కపూర్ కు తల్లిగా నటించే అవకాశాలున్నాయి. ఇందులో రణ్ బీర్ పాత్ర ఏమిటనేది ఇంకా ఖరారు కానప్పటికీ యష్ చోప్రాకు బహుశా ఇదే చివరి సినిమా అయ్యే అవకాశాలున్నందున రణ్ బీర్ ఈ ఆఫర్ ను కాదనకపోవచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా ప్రారంభించాలని యష్ రాజ్ ఆలోచన. అయితే ఆ శుభఘడియకు ముందే యష్ చోప్రాకు, ఈ చిత్రానికి కథారచయిత కూడా అయిన ఫైనాన్షియర్ కు మధ్య అభిప్రాయభేదాలు సైతం తలెత్తినట్టు తెలుస్తోంది. చోప్రా నిర్మిస్తున్న టెలివిజన్ సీరియల్స్ విషయంలో ఈ ఇద్దరికీ మధ్య తేడాలు వచ్చాయట. చోప్రా ఒక సీరియల్ కు తన సినిమా టైటిల్ పెట్టాలని అనుకున్నారనీ, ఆ టైటిల్ ను తాను తీస్తున్న ఓ సినిమా కోసం చోప్రాను సదరు ఫైనాన్షియర్ అడిగి భంగపడ్డారనీ అంటున్నారు. ఈ ప్రభావం 'రబ్ రఖా..'పై పడుతుందా లేదా అనేది చూడాలి.
News Posted: 6 January, 2010
|