'హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ' ఔట్
మరాఠి చిత్రం 'హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ' ఆస్కార్ రేసు నుంచి నిష్క్రమించింది. భారతదేశం తరఫున విదీశీ భాషా చిత్రం కేటిగిరిలో అధికారిక ఎంట్రీగా ఆస్కార్ కు వెళ్లిన ఈ చిత్రం తదుపరి పోటీకి ఎంపిక కాలేదు. దీంతో ఆస్కార్ రేసు నుంచి ఈ చిత్రం వైదొలగాల్సి వచ్చింది. తదుపరి రౌండ్ కోసం 9 సినిమాలకు ఎంట్రీ లభించింది.
భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఇండియాలోనే తొలి మోషన్ పిక్చర్ గా 'రాజా హరిశ్చద్రం' తీసినప్పుడు పడిన కష్టాన్ని 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ' ద్వారా దర్శకుడు పరేష్ మొకాషి ఆవిష్కరించారు. మొకాషి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. గెలుపు ఓటములు సార్వసధారణమేననీ, తన సినిమా ఆస్కార్ రేసు నుంచి నిష్క్రమించడం తననెంత మాత్రం నిరాశపరచ లేదని మొకాషి వ్యాఖ్యానించారు. భారతీయ భాషల్లోనే మొత్తం 20 చిత్రాల్లో తమ చిత్రం ఆస్కార్ కు అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడమమే గొప్ప విషయమని అన్నారు. కాగా, మొత్తం 65 చిత్రాలు విదేశీ కేటగిరిలో క్వాలిఫై అయ్యాయనీ, తుది జాబితాను ఫిబ్రవరి 2న ప్రకటిస్తామనీ 82వ ఆకాడమీ అవార్డ్స్ వర్గాలు తెలిపాయి. మార్చి 7న అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. తదుపరి రౌండ్ కు పోటీపడుతున్న 9 చిత్రాల్లో అర్జంటీనా చిత్రం 'ఎల్ సెక్రెటో డె సుస్ ఓజోస్', ఆస్ట్రేలియా చిత్రం 'శ్యాంసన్ అండ్ డెలిలాహ్', బల్గేరియా చిత్రం 'ద వరల్డ్ ఈజ్ బిగ్', ఫ్రాన్స్ 'అన్ ప్రోఫెట్' , జర్మనీ 'ది వైట్ రిబ్బన్', ఇజ్రాయెల్ 'ఆజమి', నెదర్లాండ్స్ 'వింటర్ ఇన్ వార్ టైమ్', పెరు 'ది మిల్క్ ఆఫ్ సోరో' ఉన్నాయి.
News Posted: 21 January, 2010
|