రిపబ్లిక్ డే 'బ్లాక్ బస్టర్'
ఇంతవరకూ ఎవరూ కనీ వినీ ఎరుగని గ్రేటెస్ట్ మల్టీస్టారర్ ఇప్పుడు 'ఫిర్ మిలే సుర్..'గీతం రూపంలో అందరి ముందుకు రాబోతోంది. ఆమితాబ్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే, జూహీచావ్లా, మమ్ముటితో సహా దేశవ్యాప్తంగా 22 మంది స్టార్స్ ఇందులో కనిపించబోతున్నారు. రెండు దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా దూరదర్శన్ ద్వారా ప్రజలను ఉర్రూతలూగించిన బహుబాషా జాతీయ సమైక్య గీతం 'మిలే సుర్ మేరా తుమ్హారా' ఇప్పుడు 'ఫిర్ మిలే సుర్'గా కొత్త రూపం సంతరించుకుని గణతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా జాతి ముందుకు రాబోతోంది. ఈ గీతాన్ని బెనట్, కోలమన్ సంస్థకు చెందిన 'జూమ్' ఛానల్ ముందుకు తెస్తోంది.
కొత్తగా చిత్రీకరణ జరుపుకొన్న ఈ గీతానికి పి.వైద్యనాథన్ తో పాటు సహ స్వరకర్తగా ఉన్న లూయీ బాంక్స్ స్వరకల్పన చేశారు. కైలాస్ సురేంద్రనాథ్ ఈ గీత చిత్రీకరణకు దర్శకత్వం హించారు. ఈ గీతానికి ఆంధ్రప్రదేశ్ తరఫున మహేష్ బాబు లీడ్ చేయడం విశేషం. ఆయనతో పాటు బ్యాండ్ మింటన్ క్రీడాకారులు గోపీచంద్, సైనా నెహ్వాల్ కూడా కనిపిస్తారు. ఈ గీతంలో కనిపించే ఇతర ప్రముఖులలో ఎ.ఆర్.రెహమాన్, శంకర్-ఎహసాన్-లాయ్, కె.జె.ఏసుదాస్, అనౌష్కా శర్మ, సోను నిగమ్, రణ్ బీర్ కపూర్, షాహిద్ కపూర్, శిల్పా శెట్టి, శ్రేయా ఘోషల్ తదితరులు ఉన్నారు.
News Posted: 25 January, 2010
|