బిగ్ బి పై జయ పుస్తకం అమితాబ్ బచ్చన్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన విశేషాలతో కూడిన 'టు బి ఆర్ నాట్ టు బి' అనే పుస్తకం ఇటీవల విడుదలై చక్కటి ఆదరణ చూరగొంది. ఇప్పుడు జయాబచ్చన్ వంతు వచ్చింది. తన భర్త అమితాబ్ జీవిత విశేషాలను ఆమె అక్షరబద్ధం చేస్తూ ఈ పుస్తక రచన చేస్తున్నారు. 'అన్ ఫరగెటబుల్ మూమెంట్స్ ఆఫ్ అమితాబ్ బచ్చన్' అనే టైటిల్ తో రూపొందనున్న బిగ్ బిబయోగ్రఫీకి సంబంధించి ఇప్పటికే జయాబచ్చన్ నాలుగు ఛాప్టర్లు రెడీ చేసి ఉంచారట.
అమితాబ్ జీవితంలోని కీలకమైన సంఘటనలు ఇందులో ఉంటాయనీ, రాజకీయ కెరీర్ పై అమితాబ్ మనోగతం, ప్రమాదంలో మృత్యువు అంచు వరకూ వెళ్లివచ్చినప్పటి అనుభవం, అభిషేక్ పెళ్లి వంటి అంశాలు ఈ పుస్తకంలో చేటుచేసుకుంటాయనీ బచ్చన్ ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే ఎబి కార్పొరేషన్ గా చెప్పుకునే ఎబిసిఎల్ ఉత్ధాన పతనాల వైనం కూడా ఇందులో చోటుచేసుకోనుంది. హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ బయోగ్రఫీ రూపొందనుందనీ, ఇంగ్లీషు వెర్షన్ ను జయాబచ్చన్ స్వయంగా రాస్తుండగా, హిందీ వెర్షన్ కోసం ఒక అనువాదకుని తీసుకోనున్నారనీ తెలుస్తోంది. పుస్తక రచన చివరికి వచ్చే దశలో జయాబచ్చన్ అధికారికంగా ఒక ప్రకటన చేసి గ్రాండ్ స్కేల్ లో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
News Posted: 29 January, 2010
|