యు ట్యూబ్ లో 'స్ట్రైకర్' ముంబయి : ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో బాలీవుడ్ కొత్తపుంతలు తొక్కుతోంది. సినిమాలను థియేటర్ లోనే కాక ఇకపై యు ట్యూబ్ లో కూడూ విడుదల చేయాలని బాలీవుడ్ నిర్మాతలు యోచిస్తున్నారు. తెలుగు సినీ హీరో సిద్ధార్థ కథానాయకుడుగా రూపొందిన స్ట్రైకర్ హిందీ సినిమాను థియేటర్లతో పాటు యు ట్యూబ్ లో కూడా రిలీజ్ చేయాలని ఆ చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ముంబయికి చెందిన కేరమ్స్ ఆటగాడి యథార్థ గాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాని ఫిబ్రవరి 5న ఇండియాలో థియేటర్ల లోనూ, విదేశాల్లో యు ట్యూబ్ ద్వారా ఆన్ లైన్ లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు యు ట్యూబ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇండియాలో మాత్రం ఆన్ లైన్ లో స్ట్రైకర్ సినిమా నెటిజన్లకు చిక్కకుండా నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. యు ఎస్ లో కూడా కొంత మొత్తం అద్దె చెల్లించి స్ట్రైకర్ ను వీక్షించవచ్చు. మిగిలిన అన్ని దేశాల్లో ఈ సినిమాను ఉచితంగానే చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నిర్మాత చెప్పారు. ఆన్ లైన్ లో సినిమాను రిలీజ్ చేయడం ద్వారా విస్తృత స్థాయి ప్రేకక్షకులకు చేరుకోగలమని, పైరసీని కూడా నియంత్రించగలమని భావిస్తున్నట్లు ఇండియన్ ఫిల్మ్స్ అధినేత సందీప్ భార్గవ చెప్పారు.
News Posted: 29 January, 2010
|