లేచి కూర్చున్న రెహ్మాన్ తల్లి
సంగీతానికి శిశువులు, పశువులు సైతం పరవశిస్తాయనీ, ఎన్నో వ్యాధులు మటుమాయమవుతాయనీ, ఆయు:ప్రమాణం పెరుగుతుందనీ విశ్వసిస్తుంటారు. భారతదేశం గర్వించదగిన సంగీత మాంత్రికుడు ఎ.ఆర్.రెహ్మాన్ సరిగ్గా అలాంటి మ్యూజిక్ థెరపీతోనే వృద్ధురాలైన తన తల్లి ఆరోగ్యాన్ని చక్కదిద్దారు. అనారోగ్యంతో మంచం మీదున్న తన తల్లిని చెంగున లేచి ఆనందంతో గెంతులేసేలా చేశారు. రెహ్మాన్ మాతృమూర్తి కరీమ బేగం కొద్దిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే తన కుమారుడుకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డులు దక్కాయన్న వార్త చెవినపడగానే మంచం మీద నుంచి దాదాపు ఉరికినంత పనిచేశారు.
'రెహ్మాన్ గ్రామీ అవార్డులు దక్కించుకున్న వార్త వినగానే కరీమా బేగం ఆనందంతో పొంగిపోయింది. తన బంధువులకు ఫోన్ చేసి ఆ శుభవార్త చెప్పడం మొదలుపెట్టింది. ఆమె ఆనారోగ్యం ఎక్కడకు పోయిందో తెలియదు. ఎంతో ఉల్లాసంగా కనిపించారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రెహ్మాన్ ఫోన్ చేసి ఆ శుభవర్తను ఆమెకు తెలియజేశారు' అని రెహ్మాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. రెహ్మాన్ సాధించిన విజయం రెహ్మాన్ మిత్రలు, పీర్స్ ను సంబరంలో ముంచెత్తింది. రెహ్మాన్ ఈ గౌరవానికి అన్నివిధాలా అర్హుడని ప్రముఖ గాయకుడు ఎస్.బి.బాలసుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. సంగీతరంగంలో ఎన్ని గొప్ప గొప్ప అవార్డులు ఉన్నాయో అవన్నీ ఆయనను వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.
News Posted: 2 February, 2010
|