'షారూక్ సినిమా చూడొద్దు' ఇండోర్ : శివసేన బాటలోనే విశ్వ హిందూ పరిషత్ (విహెచ్ పి) మరొకసారి సాగుతున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో పాల్గొనేందుకు పాకిస్తానీ క్రికెటర్లను అనుమతించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (ఎస్ఆర్ కె) తాజా చిత్రాన్ని ప్రజలు బహిష్కరించాలని విహెచ్ పి ఇప్పుడు పిలుపు ఇచ్చింది.
విహెచ్ పి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా శుక్రవారం ఇండోర్ లో మీడియాతో మాట్లాడినప్పుడు, షారుఖ్ కొత్త చిత్రం (మై నేమ్ ఈజ్ ఖాన్) పేరును ప్రస్తావించకుండానే ఈ పిలుపు ఇచ్చారు. ముంబైపై ఉగ్రవాదుదల దాడిలో తన పాత్రను పాకిస్తాన్ దాచలేదని తొగాడియా అన్నారు. ఇండియాను వ్యతిరేకిస్తున్నవారికి అనుకూల వైఖరిని బాహాటంగా అనుసరిస్తున్నందుకు షారుఖ్ చిత్రాన్ని బహిష్కరించాలని ఆయన కోరారు. అయితే, షారుఖ్ చిత్రం బహిష్కరణ గాని, ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు శాంతియుతంగానే సాగాలని తొగాడియా కోరారు. సినీ ప్రముఖులు రాజకీయ ప్రకటనలు చేయనారంభిస్తే తత్పరిణామాలకు వారు సిద్ధపడాలని ఆయన అన్నారు.
ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి వస్తూనే ఉన్నారని, ఇండియాలో ఆడేందుకు ఏ పాకిస్తానీ క్రీడాకారునినైనా రానిచ్చినట్లయితే, ఉగ్రవాద శక్తులకు ప్రోత్సాహం ఇచ్చినట్లు కాగలదని తొగాడియా అన్నారు. పాకిస్తానీ కళాకారులను కూడా భారత చలనచిత్ర పరిశ్రమలో పని చేయనివ్వరాదని ఆయన కోరారు. ఇక ముంబైపై వివాదాన్ని తొగాడియా ప్రస్తావిస్తూ, ముంబై, మహారాష్ట్ర ఇండియాకు చెందినవని, మహారాష్ట్ర ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దీనిపై ఎవరూ అనవసరంగా వివాదం సృష్టించరాదని తొగాడియా అభిప్రాయం వెలిబుచ్చారు.
News Posted: 6 February, 2010
|