ఐఐఎంలో శ్రియ లెక్చర్
అందం అందరికీ ఉండొచ్చు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకునేది మాత్రం కొందరే. గ్లామర్ నటి శ్రియా శరణ్ ఇప్పుడు ఈ కోవలోకే వచ్చి చేరింది. ఆసియాలోనే ప్రిస్టేజియస్ బిజినెస్ స్కూల్ గా పేరున్న అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) విద్యార్థులకు అందాల నటి శ్రియా శరణ్ క్లాస్ తీసుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. 'మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఆఫ్ ఎ ఫిల్మ్' అనే అంశంపై ఉపన్యసించేందుకు ఆమెకు గెస్ట్ లెక్చరర్ గా ఆ సంస్థ నుండి ఇటీవల ఆహ్వానం అందింది. దానిని పురస్కరించుకుని గత శుక్రవారం సిఎఫ్ఐ (కాంటెంపరరీ ఫిల్మ్ ఇండస్ట్రీ) రెండో సంవత్సరం విద్యార్థులకు శ్రియ క్లాస్ తీసుకుంది. ఐఐఎంలో లెక్చర్ ఇచ్చిన తొలి నటి శ్రియ కావడం విశేషం. అంతకుముందు అమీర్ ఖాన్, షారూక్ ఖాన్ లు మాత్రమే ఇలాంటి ఆహ్వానం అందుకున్నారు.
ఇండియన్ మీడియా, వినోద పరిశ్రమ చాలా వేగవంతంగా విస్తరిస్తోందనీ, దీనిని దృష్టిలో పెట్టుకునే 'సమకాలీన చిత్ర పరిశ్రమ-వాణిజ్య కోణం' అనే కొత్త ప్రోగ్రామ్ ను ఐఐఎం ప్రారంభించిందని శ్రియ తెలిపింది. రెండో సంవత్సరం విద్యార్థులకు తాను ఇవ్వాల్సిన లెక్చర్ గురించి ఐదు రోజుల పాటు ఎంతో రీసెర్చ్ చేసినట్టు ఆమె చెప్పారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సినిమా రంగం ఎలాంటి వాణిజ్య మెళకువలు పాటిస్తోందనే విషయాన్ని కూడా తన లెక్చర్ లో శ్రియ ప్రస్తావించింది. క్లాస్ రూమ్ పూర్తిగా విద్యార్థులతో నిండిపోయింది. ఆమె అనర్ఘళంగా ఉపన్యసించడం, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా ఇచ్చిన సమాధానాలు అందర్నీ సంతృప్తిపరచాయి. దీంతో శ్రియ లెక్చర్ ఇన్ స్టంట్ హిట్ గా నిలిచింది.
News Posted: 16 February, 2010
|