రిజ్వాన్ను కొట్టిన రాంఛో
ముంబయి :'రిజ్వాన్ ను రాంఛో కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అంతేగాక బాలీవుడ్ బాక్సాఫీస్ రేస్ లో అందనంత దూరంలో మెరుపు వేగంతో రాంఛో ముందుకు దూసుకుపోతున్నాడు. నెంబర్ వన్ రేస్ లోకి లేటెస్ట్ గా వచ్చిన రిజ్వాన్ కాస్త పోటీ వస్తాడని అంతా భావించినా చివరకు రాంఛోకు ఎదురులేదని తేలిపోయింది. బాక్సాఫీసు కలెక్షన్లలో తనకు తిరుగులేదని నిరూపించాడు రాంఛో'. అసలెవరీ రిజ్వాన్..రాంఛోలనుకుంటున్నారా..ఇంకెవరు మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాలో హీరో షారుఖ్ రిజ్వాన్ కాగా, త్రి ఇడియట్స్ సినిమా హీరో అమీర్ ఖాన్ రాంఛో. ఈ టాప్ హీరోలు నటించిన రెండు సినిమాలు ఇటీవల కాలంలో విడుదలయ్యాయి. ఈ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. క్లాస్ రూమ్ జీనియస్ గా రాంఛో పాత్రలో అమీర్ నటించగా, 9/11 అమెరికాపై జరిగిన దాడిలో బాధితుడుగా మిగిలిన ముస్లిం యువకుడు రిజ్వాన్ పాత్రలో షారుఖ్ లు నటించారు. ముందుగా రిలీజైన అమీర్ నటించిన త్రీ ఇడియట్స్ చిత్రం బాక్సాఫీసు దగ్గర రికార్టు స్థాయి కలెక్షన్ లు వసూలు చేస్తున్న సమయంలో, షారుఖ్ సినిమా మై నేమ్ ఈజ్ ఖాన్ విడుదలైంది. దీంతో అమీర్ సినిమాకు కలెక్షన్లు తగ్గుతాయని అంతా భావించారు. రిలీజ్ కు ముందే అత్యంత వివాదాల్లో మునిగితేలి విపరీతమైన ప్రచారాన్ని ఫ్రీ గా కొట్టేసిన షారుఖ్ బాక్సాఫీసు దగ్గర రికార్డులు సృష్టించడం ఖాయమనే ప్రచారం సాగింది.
ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఆందరి అంచనాలను తల కిందులు చేస్తూ ధియేటర్లలో అమీర్ తన హావాను ప్రదర్శిస్తుండగా, షారుఖ్ సినిమా స్థానంలో కార్తీక్ కాలింగ్ కార్తీక్ సినిమా ప్రదర్శనకు ఎగ్జిబిటర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాక్సాఫీసును అమీర్ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయంగా త్రి ఇడియట్స్ కలెక్షన్లు 385 కోట్ల రూపాయలకు చేరుకోగా, షారుఖ్ కలెక్షన్ లు కేవలం 160-170 కోట్ల రూపాయలకే పరిమితమయ్యాయి. సినిమా విడుదలైన మొదటి పది రోజులకు గాను త్రీ ఇడియట్స్ 240 కోట్ల రూపాయలు వసూళ్లు బాక్సాఫీసును ముంచెత్తగా, మై నేమ్ ఈజ్ ఖాన్ మాత్రం కేవలం 150 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇంతటి భారీ కలెక్షన్ లతో బాక్సీఫీసును కొల్లగట్టిన ఇడియట్స్ ఇంకా ప్రేక్షకులను ధియేటర్లుకు పరుగులు తీయిస్తుండంగా, మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమా ఆడుతున్న ధియేటర్లు దాదాపుగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
దీంతో ఈ మూవీ స్థానంలో బాలీవుడ్ బారీ అంచనాలు పెట్టుకున్న మరో రెండు సినిమాలు ప్రదర్శనకు ఎగ్జిబిటర్లు సన్నాహాలు ప్రారంభించారు. ఫర్హాన్ అక్తర్, దీపికా పడుకునే కలసి నటించిన కార్తీక్ కాలింగ్ కార్తీక్, అమితాబ్ నటించిన ధ్రిల్లర్ మూవీ తీన్ పట్టి సినిమాలు ప్రదర్శించడం ద్వరా కలెక్షన్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు.'మై నేమ్ ఈజ్ ఖాన్ కు కలెక్షన్లు తగ్గాయి. ధియేటర్ 25 శాతం కూడా నిండటం లేదు. మై నేమ్ ఈజ్ ఖాన్ స్థానంలో త్వరలో వస్తున్న కార్తీక్ కాలింగ్ కార్తీక్ సినిమా ప్రదర్శన కోసం ప్రైమ్ స్లాట్స్ ను కేటాయించాం' అని సినీమ్యాక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విశాల్ కపూర్ వెల్లడించారు.
త్రీ ఈడియట్స్ మొదటి వారం కలెక్షన్లు 79 కోట్ల రూపాయలు కాగా, రెండో వారంలో55 కోట్ల రూపాయలు కలెక్షన్ లు సాధించినట్లు సినీ ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహాటా చెప్పారు. షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ హిట్ రికార్డు కలెక్షన్ గా ఉన్న ఓం శాంతి ఓం (2007) చేసిన 79 కోట్ల రూపాయలను అమీర్ త్రీ ఇడియట్స్ మూవీ మొదటి వారంలోనే క్రాస్ చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
News Posted: 24 February, 2010
|