'ఫూంక్-2' చూసే దమ్ముందా?
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/phoonk2.jpg' align='right' alt=''>రామ్ గోపాల్ వర్మకు ప్రేక్షకులను భయపెట్టడమంటే సరదా. అయితే ఎన్ని భయానక సినిమాలు తీసినా ప్రేక్షకుడు ఎందుకో బెదరడం లేదు. ఇది గ్రహించే వర్మ ఆమధ్య 'ఫూంక్' చిత్రం కోసం వినూత్నమైన పబ్లిసిటీ చేశారు. 'దమ్ముంటే మా సినిమా ఒంటరిగా చూడండి..బయపడకుండా థియేటర్ల నుంచి బయటకు వస్తే 5 లక్షల క్యాష్ ఫ్రైజ్ మీ సొంతం' అంటూ సవాల్ విసిరారు. ఓ చిచ్చరపిడుగు ఆ సాహసం చేసినా 30 నిమిషాల తర్వాత థియేటర్ బయటకు వచ్చేశాడట. దాంతో ఈ కాంటెస్ట్ అంతా రిగ్గింగేననీ, సినిమా చూసి బెదరేందుకు ఏముందంటూ కొందరు బాహాటంగానే వర్మపై విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగితే వర్మ ప్రత్యేకత ఏముంటుంది? ఇప్పుడు ఆయన మళ్లీ 'ఫూంక్-2' చిత్రాన్ని తన శిష్యుడు మిలింద్ గడాక్కర్ దర్శకత్వంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. షరామామూలుగానే వర్మ మళ్లీ ఈసారి కూడా 'టెర్రర్ కాంటెస్ట్'తో సిద్ధపడుతున్నారు. 'ఫూంక్' సమయంలో వచ్చిన విమర్శలకు ఈసారి తావులేకుండా శాస్త్రీయ పద్ధతిలో ఈ కాంటెస్ట్ ను నిర్వహించబోతున్నారు. ఆ ప్రకారం కాంటెస్ట్ లో పాల్గొనే ప్రేక్షకుడు భయపడ్డాడా, లేదా అనేది అతని హార్ట్ బీట్ ను బట్టి తెలుసుకుంటారు.
'ఫూంక్-2' చిత్రాన్ని థియేటర్ లో చూసేందుకు రెడీ అయిన పోటీదారుడికి ఇ.సి.జి. మిషన్ అమరుస్తారు. ఆ మిషన్ అతని హార్ట్ బీట్ లేదా పల్స్ రేటును ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ తిలకించేందుకు థియేటర్ బయట స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. సంబంధిత వ్యక్తులతో పాటు మీడియా సమక్షంలో ఇదంతా జరుగుతుంది. సహజంగా ప్రతి వ్యక్తికి హార్ట్ బీట్ సాధారణ స్థాయిలో ఉంటుందనీ, ఒకవేళ భావోద్వేగానికి గురయితే గుండె వేగం పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. 'ఫూంక్-2' కాంటెస్ట్ లో పాల్గొనే వ్యక్తి సినిమా చూసి తానేమీ భయపడలేదని చెబితే అందులో నిజమెంతో సదరు మానిటర్ బయట పెట్టేస్తుంది. అలాకాకుండా ఒకవేళ భయపడినా కంట్రోల్ చేసుకుంటా హార్ట్ బీట్ ను అదుపులో ఉంచుకోగలిగితే నగదు బహుమతి అతని సొంతం అవుతుంది. 'ఫూంక్-2' కాంటెస్ట్ ను మార్చి 10న www.phoonk2.in వెబ్ సైట్ లో ప్రకటిస్తారు. హృద్రోగ సమస్యలు లేకుండా ఆరోగ్యం ఉన్న వ్యక్తులే ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. మరి చూసే దమ్ముందా? బి రెడీ...
News Posted: 25 February, 2010
|