'3 ఇడియట్స్'కు 6 ఫిల్మ్ ఫేర్స్
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/amit-vidyabalan.jpg' align='right' alt=''>ముంబై: బాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డులను బద్దలుకొట్టిన అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా 6 'ఫిల్మ్ ఫేర్' అవార్డులను సొంతం చేసుకుంది. రాజ్ కుమార్ హిరానీ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. 55వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం యష్ రాజ్ స్టూడియోస్ లో శనివారం రాత్రి కన్నులపండువగా జరిగింది. ఉత్తమ నటుడు పురస్కారాన్ని 'పా' చిత్రంలో ప్రొజేరియాతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడుగా అత్యద్భుత నటన ప్రదర్శించిన అమితాబ్ బచ్చన్ గెలుచుకున్నారు. అమితాబ్ తల్లిగా నటించిన విద్యాబాలన్ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. అయితే ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ గ్రూప్ నకు చెందిన టాబ్లాయిడ్ తమ కోడలు ఐశ్వర్యారాయ్ ఆరోగ్యానికి సంబంధించి తప్పడు కథనం ప్రచురించినందుకు నిరసనగా అమితాబ్ కుటుంబం ఈ వేడుకకు గైర్హాజరైంది. అమితాబ్ తరఫున ఆయనకు ప్రకటించిన ఉత్తమ నటుడి అవార్డును విద్యాబాలన్ స్వీకరించారు.
ఈ ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న మరో లెజెండ్ ఎ.ఆర్.రెహమాన్. 'ఢిల్లీ 6' చిత్రానికి అందించిన సంగీతానికి గాను ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లభించింది. ఇది ఆయనకు 25వ ఫిల్మ్ ఫేర్ అవార్డు కావడం విశేషం. సీనియర్ నటుడు శశికపూర్, సంగీత దర్శకుడు ఖయ్యంలు జీవితకాల సౌఫల్య పురస్కారాన్ని (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్) అందుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును 'ఫిరాఖ్' గెలుచుకుంది. క్రిటిక్స్ విభాగంగా ఉత్తమ నటి అవార్డును మహి గిల్ (దేవ్ డి), ఉత్తమ నటుడు పురస్కారం రణ్ బీర్ కపూర్ (వేక్ అప్ సిద్) దక్కించుకున్నారు. అవార్డులు అందుకున్న వారిలో బొమాన్ ఇరానీ (ఉత్తమ సహాయ నటుడు- 3 ఇడియట్స్), కల్కి కొయెచ్లిన్ (ఉత్తమ సహాయనటి- దేవ్ డి), అయన్ ముఖర్జీ (ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు - వేక్ అప్ సిద్), జియో అక్తర్ (ఉత్తమ తొలిచిత్ర మహిళా దర్శకురాలు -లక్ బై చాన్స్) తదితరులు ఉన్నారు. సంగీత విభాగంలో ఆర్.డి.బర్మన్ అవార్డును అమిత్ త్రివేది (దేవ్ డి), బెస్ సినిమాటోగ్రఫీ అవార్డును రాజీవ్ రవి (దేవ్ డి) అందుకున్నారు. షారూక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా, జెనీలియా, టబూ, కాజల్, షాహిద్, రాజు హిరానీ, మాధవన్, ఓమి, విధు వినోద్ చోప్రా తదతర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
News Posted: 1 March, 2010
|