పదిహేనేళ్ళుగా 'దిల్ వాలే' ముంబయి : ఓ సనిమా ఎన్ని రోజులు ఆడుతుంది?. కాస్త బాగుంటే వంద రోజుల వరకు సాగుతుంది. చాలా చాలా బాగుంటే రెండొందల రోజులు ఆడుతుంది. ఇంకా ఎక్సట్రా ఆర్డనరీగా హిట్ అయితే సంవత్సరం ఆడుతుంది. కానీ ఓ సినిమా ఏకంగా 15 సంవత్సరాలు పాటు నిరంతరాయంగా ధియేటర్ లో ప్రదర్శింపబడింది. ఆ సినిమా మరేదో కాదు దిల్ వాలే దుల్హానియా లే జాయింగే. ముంబయిలోని సెంట్రల్ మరాఠా మందిర్ థియేటర్లో ఈ సినిమా తాజాగా 750 వారాలను పూర్తి చేసుకుంది.
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తేలింది. గతంలో ఏ భారతీయ చిత్రం ఇన్ని రోజులపాటు థియేటర్లలో ప్రదర్శింపడిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఇంతటి గ్రేట్ రికార్డును సొంతం చేసుకున్న ప్రధమ చిత్రం ఇదే కావడం విశేషం. షారుఖ్, కాజోల్ జంటగా నటించిన అద్భుత ప్రేమకావ్యం ఈ సినిమా. ఎన్ ఆర్ ఐలు అయిన ఓ జంట మధ్య సాగిన ప్రేమాయాణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఏకంగా 15 ఏళ్ల పాటు ప్రేక్షకులను థియేటర్లుకు రప్పించింది. అరుదైన ఈ ఘనత సినిమాకే దక్కింది. బాలీవుడ్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం 1995లో దేశవ్యాప్తంగా విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అకట్టుకుంది. ఎంతగా అంటే ఇప్పటికీ ఆ సినిమాలో డైలాగులు, పాటలు ప్రేక్షకుల పెదాలపై పలుకుతూనే ఉన్నంతగా. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన షారుఖ్, కాజోల్ లు అప్పటి నుండి ఇప్పటివరకు హిట్ పెయిర్ గానే వీక్షకుల ప్రశంసలను అందుకుంటున్నారు. బ్లాక్ బ్లస్టర్ మూవీగా బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ సంచలనంగానే మిగిలింది.
News Posted: 5 March, 2010
|