న్యూఢిల్లీ: రష్యా విమాన వాహక యుద్దనౌక 'అడ్మిరల్ గోర్షకోవ్' కొనుగోలు వ్యవహారం రానురాను హాస్యాస్పదంగా తయారయ్యింది. కొనుగోలు ఒప్పందంలో కుదిరిన బేరానికి రెండితలు చెల్లించాలని ఒకసారి రష్యా పట్టుపట్టింది. దానికి చచ్చీచెడి ఒప్పుకున్నప్పటికీ మరో 700 మిలియన్ల డాలర్లను అదనంగా చెల్లించాలని ఇప్పుడు మరో తాఖీదును పంపింది. దాంతో 2004 జనవరి 29న కుదిరిన ఒప్పందంలోని ధరతో పోలిస్తే ఆ యుద్దనౌక ధర మూడింతలయ్యింది. ఆనాడు 974 మిలియన్ డాలర్లకు ఎన్డిఏ ప్రభుత్వం కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ నౌకకు 2.9 బిలియన్ డాలర్ల ధరను చెల్లించాలని రష్యా డిమాండ్ చేస్తోంది.
పాత యుద్దనౌక మరమ్మతుకు గాను 350-400 మిలియన్ డాలర్లు అదనంగా చెల్లించవలసి రావచ్చని భారత్ అంచనా వేసింది. అయితే రష్యా ఏకంగా 1.2 బిలియన్ డాలర్లును అదనంగా డిమాండ్ చేసింది. దాంతో ఆ యుద్ధ నౌక ఖరీదు 2.2 బిలియన్ డాలర్లకు చేరింది. భారత రష్యా దేశాల మధ్య పలుమార్లు గోర్షకోవ్ కొనుగోలు వ్యవహారంపై చర్చలు జరిగాయి. భారత రక్షణ శాఖ మంత్రి ఏకె ఆంటోని రష్యా పర్యటించి వచ్చారు. 2008 డిసెంబర్ లో రష్యా డిమిట్రి మెద్వదెవ్ భారత్ ను సందర్శించిన సందర్భంగా ఈ విషయంపై చర్చలు కూడా జరిగాయి. చివరగా గోర్షకోవ్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.