గద్దె ఒక్కటే, కులాలు మూడు
తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కంటె కోస్తాలో కులాల ప్రాముఖ్యం, ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.దీని ప్రభావం ఇప్పటికే కోస్తా మీద పడింది. కాపు, కమ్మ కులాల మధ్య చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. కాపు కులాన్ని వ్యతిరేకిస్తున్న ఇతర కులాలు స్థానిక అభ్యర్ధి కులం, విజయావకాశాల ఆధారంగా ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన కాపు అభ్యర్ధులకు ప్రజారాజ్యం కొద్దిగా భయం కలిగిస్తోంది. కులం ప్రభావం ఎక్కువగా వున్నట్టయితే తాము విజయం సాధించలేమన్న సందేహం వారిని పీడిస్తోంది. అందువల్లనే కాపు కులస్తుల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్, దేశం ఎమ్మెల్యేలు, నాయకులు కొందరు ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అయితే కులం ప్రభావం ఎంతగా ఉన్నా, ఒకే కులానికి చెందినవారు అదే కులం అభ్యర్ధికి ఓటు వేయరని కాంగ్రెస్, దేశం నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
వాస్తవానికి ఏ పార్టీ విజయంలో అయినా బీసి, ఎస్సీ ఓటర్లే ప్రధాన పాత్ర వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోను ఎస్సీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పడు వారిలో కూడా రెండు మూడు వర్గాలు ఏర్పడ్డాయి. కొంకాలంగా తెలుగుదేశంకు అండగా ఉంటున్న బిసిలలో మార్పు కనిపిస్తోంది. అలాగే తెలంగాణ అంశం ప్రభావం కూడా ఈసారి కనిపించే అవకాశాలు లేవు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో తెలంగాణకు చెందిన వారు లేకపోవడంతో వేరే ప్రాంతాలకు చెందిన వారికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే ఈసారి ఎన్నికలు అత్యంత ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 23 February, 2009
|