'హస్తం' అందుకున్న మమత
కోలకతా: లోక్ సభ ఎన్నికలలో కలసి పోటీ చేయనున్నట్లు మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఆదివారం రాత్రి ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్ లోని బిష్ణుపూర్ వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సిపిఎంను తృణమూల్ కాంగ్రెస్ చిత్తుగా ఓడించిన రోజే ఈ నాటకీయ ప్రకటన వెలువడింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మిత్రా 30 వేల పైచిలుకు వోట్ల ఆధిక్యంతో తన సిపిఎం ప్రత్యర్థి నుంచి బిష్ణుపూర్ వెస్ట్ అసెంబ్లీ సీటును కైవసం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి తన పతనాన్ని లెఫ్ట్ ఆపలేకపోతోందనడానికి ఇది తాజా నిదర్శనం. అంతేకాదు కాంగ్రెస్ తో పొత్తు అవసరాన్ని కూడా ఇది నొక్కి చెబుతున్నది.
కోలకతా లేక్ రోడ్ లోని గెస్ట్ హౌస్ లో మమతతో ఒక రౌండ్ చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, 'రానున్న లోక్ సభ ఎన్నికలలో బెంగాల్ లో మొత్తం 42 స్థానాలకు కలసి పోటీ చేయాలని మేము లాంఛనంగా నిర్ణయించాం. మమతా బెనర్జీతో మా చర్చలు ఫలప్రదమైనాయి. సీట్ల పంపకం ఒప్పందం వివరాలను మేము అతి త్వరలోనే ప్రకటించగలం' అని తెలియజేశారు.
Pages: 1 -2- -3- News Posted: 1 March, 2009
|