'హస్తం' అందుకున్న మమత
మమత మీడియాతో మాట్లాడుతూ, 'చర్చలు అత్యంత సుహృద్భావపూర్వక వాతావరణలో, అర్థవంతంగా జరిగాయి. బెంగాల్ లో సిపిఎం దుష్పరిపాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలని మేము నిర్ణయించాం. మేము కనుక కలసి పోటీ చేసినట్లయితే సిపిఎంను కచ్చితంగా బెంగాల్ నుంచి తరిమేయగలం' అని చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ మమత భుజాన్నితట్టుతూ, 'లెఫ్ట్ వ్యతిరేక వోట్ల చీలికను నివారించేందుకు పొత్తు అత్యవసరం' అని అన్నారు. సీట్ల పంపకానికి సంబంధించిన వివరాలపై ప్రశ్నకు ప్రణబ్ సమాధానం ఇస్తూ, 'మాకు కొన్ని నిర్బంధాలు ఉన్నాయి. అందువల్ల మేము ఇక్కడ వాటిని చర్చించజాలం. ఢిల్లీలో ఎఐసిసి ఆ విషయాన్ని ఖరారు చేస్తుంది' అని చెప్పారు. పొత్తు విధివిధానాలను తేల్చడానికై మమత ఢిల్లీలో సోనియా గాంధితో సమావేశం కావచ్చునని కాంగ్రెస్ వర్గాలు సూచించాయి.
బిష్ణుపూర్ శాసనసభ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని కాంగ్రెస్ ఉపసంహరించుకున్న తరువాత ఎన్నిక ఫలితం అంచనాలకు తగినట్లుగానే వెలువడింది. 2006లో కూడా ఈ స్థానంలో ప్రతిపక్షాలన్నిటికీ కలిపి మెజారిటీ వోట్లు పోలయ్యాయి. అయితే, ఆదివారం మిత్రా విజయం రెండు అంశాలను నొక్కి చెప్పింది. మొదటిది - సిపిఎం పతనమవుతుండగా తృణమూల్ వృద్ధి చెందుతున్నది. గత మేలోని పంచాయతీ ఎన్నికలు, డిసెంబర్ లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నిక సూచించిన సరళి కొనసాగుతుండడమే కాకుండా సిపిఎం వోట్లు తుడిచిపెట్టుకుపోతుండడం కూడా ఎక్కువైంది. 2006 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే సిపిఎం వోట్ల వాటా 7 శాతం మేర తగ్గిపోయింది.
ఇక రెండవది - పాలనా యంత్రాంగం పరంగా, రాజకీయ పరంగా కృషి చేస్తున్నప్పటికీ మైనారిటీ వర్గాలు, బలహీన వర్గాల వోటర్లను సిపిఎం తిరిగి ఆకర్షించలేకపోతున్నది. ఈ స్థానంలో సుమారు 22 శాతం మంది వోటర్లు ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన ఒక అభ్యర్థిని పార్టీ నిలబెట్టింది. అయినప్పటికీ పార్టీ ఓడిపోయింది. ఈ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్ సి) వోటర్లు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు. తృణమూల్ అభ్యర్థి మిత్రా ఇతర ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ తన సమీప ప్రత్యర్థి సిపిఎంకు చెందిన ఇస్కందర్ హుస్సేన్ ను ఓడించారు. ఈ నియోజకవర్గంలో పోలైన 1,46, 935 వోట్లలో మిత్రా 85,340 వోట్లను సంపాదించారు.
Pages: -1- 2 -3- News Posted: 1 March, 2009
|