చెదరిన యుఎస్ డిగ్రీ కల
బెంగళూరు: ప్రపంచ ఆర్ధిక సంక్షోభం భారతీయ స్వప్నాలను మసకబార్చింది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పూర్తి చేయాలన్న భారతీయ స్వప్నాలను మాంద్యం మబ్బులు కమ్మేసింది. అమెరికా సబ్ ప్రైమ్ క్రైసిస్ తో మొదలై, ప్రపంచ మహా మాంద్యంగా పరిణమించడంతో అమెరికాకు పోవాలంటే భయపడే వారి సంఖ్య ఎక్కువైంది. ఇలా వేడెక్కిన ఆర్ధిక సామాజిక వాతావరణం నేపథ్యంలో అమెరికా పై చదువుల కలలు పీడకలలుగా విద్యార్ధులను భయపెట్టే పరిస్థితి ఏర్పడింది.
'ఉదయం స్కైయింగ్, సాయంత్రం స్కూబా డైవింగ్ కు పోండి. పార్టీ బట్టలతో సహా సర్దుకోండి తప్పదు' అన్న మాటలు ఏదో వేసవి టూర్ ప్యాకేజి ప్రకటన అనుకునేరు సుమండీ. అలా అయితే పప్పులో కాలేసినట్లే. యూనివర్సీటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యుఎస్ సి)కు చెందిన రిక్రూట్ మెంట్ కోఆర్డినేటర్ సుధా కుమార్ బెంగుళూరు పిఈఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ విద్యార్ధులతో కాన్పరెన్స్ హాల్ లో చేసిన ప్రసంగంలోని మాటలవి. విద్యార్ధులను పై చదువులకు అమెరికాకు పంపించేందు ఉత్సాహపరచేందుకు ఆమె అలా మాట్లాడారు. చాలా మంది భారతీయ విద్యార్ధులు అమెరికా యుఎస్ సిలో చదివేందుకు ఆరాటపడతారు. అయితే ఆర్ధిక మాంద్యం విద్యార్ధులను సందిగ్ధంలోకి నెట్టింది. నిరుడు దాదాపు ఒక లక్ష మంది విద్యార్ధులు అమెరికాలో పై చదువులు చదివేందుకు వెళ్లారు.
అమెరికాలో పై చదువు చదివి, వెంటనే అమెరికా ఉద్యోగం సంపాదించడం సగటు భారతీయ మధ్యతరగతి స్వప్నంగా ఉండేది. ఈ స్వప్నం అమెరాకు 'మేథో లాభంగాను', భారత్ కు 'మేథో నష్టం'గాను ఉన్న విషయం తెలిసిందే. అమెరికాలోని మరే విశ్వవిద్యాలయానికి లేని డిమాండ్ యుఎస్ సి ఉన్నప్పటికీ విద్యార్ధులు కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు. దాంతోపాటు అమెరికా జాబ్స్ మార్కెట్ కుప్పకూలిపోవడం, రూపాయి విలువ భారీగా పడిపోవడంతో కోర్సులకు పెట్టే ఖర్చు పెరగడం, బ్యాంకులు విద్యార్ధులకు రుణాలివ్వకపోవడం, అమెరికా విశ్వవిద్యాలయాలు విద్యార్ధులకు ఆర్ధిక సహకారం అందిచక పోవడంతో పై చదువులకు అమెరికాకు వెళ్లే విద్యార్ధులే కరువైనారు. పిఈఎస్ఐటి లాంటి ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు సైతం అమెరికా చదువులకు వెనకంజ వేస్తున్నారు. అమెరికా ఎంబసీ కళావిహీనంగా తయారైంది.
Pages: 1 -2- -3- News Posted: 2 March, 2009
|