చిరు గుర్తుకు `అరచేయి' అడ్డు?
హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల గుర్తు రాకుండా కాంగ్రెస్సే మోకాలు అడ్డుతోందా? అవుననే అంటున్నాయి ప్రజారాజ్యం పార్టీ వర్గాలు. చిరంజీవికి రాష్ట్రంలో లభిస్తున్న అనూహ్య ఆదరణను చూసి బెంబేలెత్తుతున్న కాంగ్రెస్ ప్రజారాజ్యానికి ఎన్నికల్లో చిక్కులు కలిగించడానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోందని, దానిలో భాగం గానే ఈ ఎత్తుగడను అమలు చేస్తోందని చెబుతున్నారు.అభిమానుల అండదండలకు కొదువ లేదు. ప్రజా స్పందనకు తిరుగులేదు. సమ్మోహన శక్తి విజయతీరాలకు చేర్చుతుందన్న విశ్వాసానికీ తరుగులేదు. కాని వచ్చిన చిక్కల్లా ఎన్నికల గుర్తు రాకపోవడమే. ప్రజారాజ్యం పార్టీని తీవ్రంగా కలవరపరుస్తున్న సమస్య ఇదే. ఇప్పటికే రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించడానికి నిర్వచన్ సదన్ నిరాకరించడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్ధులుగా పోటీ చేసే అభ్యర్ధులకు ఒకే గుర్తు లేకపోతే కష్టాలు తప్పవు. ఎలాగైనా ఒకే గుర్తును తెచ్చుకోవాలని ప్రజారాజ్యం తంటాలు పడుతుంటే, ఈ పరిణామాలు ప్రధాన ప్రత్యర్ధి పార్టీలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్, మహాకూటమి నేతలు బయటకు చెప్పక పోయినా సంతోషంతో తబ్బిబ్బవుతున్నారు.
అయినప్పటికీ ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఇప్పటికీ ఆశావహ దృక్ఫధంతోనే ఉన్నారు. చివరి క్షణంలోనైనా తమకు ఎన్నికల గుర్తు రావడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంత కఠినంగా వ్యవహరించడంపై పార్టీలోని సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఏ పార్టీ విషయంలోనూ ఎన్నికల సంఘం ఇలాంటి ధోరణి ప్రదర్శించలేదని, అప్పట్లో తెలుగుదేశం పార్టీకి, మొన్నటికి మొన్న తెరాసకు ఎన్నికల గుర్తు కేటాయించడంలో ఉదారం గానే వ్యవహరించిందని, కానీ ప్రజారాజ్యం విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మొండి వైఖరికి బలమైన కారణాలే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ప్రజారాజ్యానికి ఎన్నికల గుర్తు రాకుండా కాంగ్రెస్ పెద్దలే అడ్డుపడుతున్నారన్న వాదన ప్రజారాజ్యం వర్గాలలో బలంగా వినిపిస్తోంది.
Pages: 1 -2- -3- News Posted: 6 March, 2009
|