ప్రజారాజ్యం కూడా ఢిల్లీ స్థాయిలో పెద్ద స్థాయిలోనే ప్రయత్నలను సాగిస్తోంది. చిరంజీవిని అభిమానించే ఉన్నతాధికారులు చాలా మంది ఎన్నికల గుర్తు సాధనలో తలమునకలై ఉన్నారు. అలానే శివశంకర్, పరకాల ప్రభాకర్ తదితరులు కూడా తమకు గతంలో ఉన్న ఢిల్లీ స్థాయి పరిచయాలను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా శరద్ పవార్ వంటి శక్తిమంతమైన నాయకులు కూడా చిరంజీవికి అండదండలు అందిస్తున్నారని ప్రజారాజ్యం వర్గాలు చెబుతున్నాయి. ఈ నాయకులను దృష్టిలో పెట్టుకునే చిరంజీవి జాతీయ స్థాయిలో నాలుగో ప్రత్యమ్నాయం గురించి మాట్లాడుతున్నారని వివరణ ఇస్తున్నారు. నిజానికి ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలస్వామితో పాటు మరో కమిషనర్ ఖురేషి కూడా సుముఖంగానే ఉన్నారని, కాంగ్రెస్ విధేయుడిగా ముద్ర పడిన నవీన్ చావ్లా ఒక్కరే ససేమిరా అంటున్నారన్న వార్త కూడా ప్రజారాజ్యం శ్రేణుల్లో చక్కర్లు కొడుతోంది.
మెజారిటీ అభిప్రాయంగా ఇద్దరు సభ్యుల ఆమోదంతో ఎన్నికల గుర్తును కేటాయించినట్టు గోపాలస్వామి ప్రకటించే అవకాశం ఉంది.కానీ మరో నెల రోజులో పదవీ విరమణ చేసే తాను పాలక పక్షం అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఎందుకనే ఆలోచనలో ఆయన ఉన్నారని కూడా చెబుతున్నారు. అందుకనే ప్రజారాజ్యం న్యాయస్థానాలను ఆశ్రయిస్తోంది. రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘానికి సూచన చేసింది. దానిని నిర్వచన్ సదన్ పెడచెవిన పెట్టి మళ్ళీ నిబంధనల చిట్టా విప్పింది. తాజాగా ప్రజారాజ్యం మళ్ళీ హై కోర్టును ఎన్నికల గుర్తు గురించి వేడుకుంది. ఈనెల 16వ తేదీలోగా ఈ విషయంపై నిర్ణయం చెప్పాలని న్యాయమూర్తులు ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసారి కూడా తిరస్కరిస్తే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ప్రజారాజ్యం నాయకులు నిర్ణయించారు. హై కోర్టు సూచించినట్టే సుప్రీం కోర్టు కూడా ఎన్నికల సంఘానికి సూచన చేస్తే తప్పని సరిగా తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందనే ఆశతో ప్రజారాజ్యం నాయకులు ఉన్నారు.రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులంతా ఒకే గుర్తుపై పోటీ చేయడానికి వీలుగా ఎన్నికల గుర్తును సాధించడానికి ప్రజారాజ్యం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది.