బాబు అందరికీ అలుసే!
(వరప్రసాద్ గాలిదేవర)
హైదరాబాద్ : మెత్తని వాడిని చూస్తే మొత్తబుద్దవుద్దట! చంద్రబాబును చూస్తే ఏవరికైనా సీట్లు అడగబుద్దేస్తుందట. ఏలాగైనా వైఎస్ ను ఓడించి ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలని ఆరాటపడిపోతున్న చంద్రబాబు మరీ మెత్తబడిపోతున్నారట. చంద్రబాబు ఆశను గమనించిన వారు ఇదే అదనుగా, ఆయన ఆశనే అలుసుగా తీసుకుని మరీ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారట. కాంగ్రెస్ ను ఓడించాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో తెలుగుదేశంతో జత కట్టిన వామపక్షాలు, తెరాస సంగతి పక్కన పెడితే మద్దతు పేరుతో పక్కకు చేరిన వారు కూడా చంద్రబాబుపై స్వారీ చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు తెగ బాధ పడిపోతున్నారు. వచ్చిన వారు ఒకటో రెండో కాదు ఏకంగా ఇరవైలు, ముప్పైలు సంఖ్యలో సీట్లు డిమాండ్ చేస్తున్నారు. సీట్ల పంపకం కొలిక్కిరాక మహాకూటమి సారధి చంద్రబాబు సతమతమవుతున్నారు. ఎక్కడైనా మావే గాని వంగతోట కాడ కాదన్నట్టు మహాకూటమిలో బాబే కాని సీట్ల బేరాల దగ్గర కాదన్నట్టు మిత్రపక్షాల నేతలు పట్టిన పట్టు విడవకుండా చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించేస్తున్నారు. కొండెక్కి కూర్చున్న మిత్రులు కిందకు దిగడానికి ససేమిరా అంటూ చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు.
రకరకాల కారణాలతో, లక్ష్యలతో మహాకూటమికి ఎన్నికల్లో మద్దతు తెలిపే సంఘాల సంఖ్య బాగానే ఉంది. ప్రతీ సంఘం తమ మద్దతుకు ప్రతిఫలంగా సీట్లను అడగటమే చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఒకవేళ చంద్రబాబు స్థిర నిర్ణయం తీసుకుని సీట్లను ఇవ్వడానికి తిరస్కరిస్తే తమ మద్దతు లేకపోతే మహకూటమికి ఓటమి తప్పదనే హెచ్చరికలు చేస్తున్నారు. అంతేనా ఓడించానికి తాము పనికి వస్తామనో, లేకపోతే ఏ ప్రజారాజ్యం పక్కకో వెళిపోతామనో బెదిరిస్తున్నారట. ఈసారి ఎలాగైన అధికార పీఠాన్ని అధిరోహించాలనే పట్టుదలతో, ఎవరు మద్దతు ఇస్తామన్నా మరో ఆలోచన లేకుండా అక్కున చేర్చుకుంటున్న చంద్రబాబు అసలు అశుభం మాటలు వినడానికి కూడా ఇష్టపడటం లేదట. అందుకే ఎవరు సీట్ల బేరం పెట్టినా బుద్దిగా తలూపి, ఆతరువాత వారిని బుజ్జగించడానికి రేయింబవళ్లు నిద్రాహరాలు మాని నానా పాట్లు పడుతున్నారని సన్నిహితుల సమాచారం.
Pages: 1 -2- -3- News Posted: 9 March, 2009
|