బాబు అందరికీ అలుసే!
వడ్డించేవాడికి లేని బాధ చూసేవాడికి ఎందుకన్నట్టు చంద్రబాబు సీట్ల సంతర్పణ మహాకూటమిలోని మిత్రపక్షాలకూ నచ్చడం లేదు. తెరాసకు కేటాయించే సీట్లను గురించి వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కోమ్ముల వాడి అన్నట్టు కూటమి ఏర్పడటానికి కారణమైన తమను చంద్రబాబు చిన్నచూపు చూడటం పట్ల సిపిఐ, సిపిఎం నేతలు కినుక వహించారు. తెలంగాణాలో మాదే పెద్ద పార్టీ కాబట్టి తెలుగుదేశం మాకు సీట్లిచ్చేది ఏమిటీ? మేమే వాళ్లకు ఇస్తామన్న తెరాస అధినేత కేసీఆర్ ఇప్పుడు సీట్ల సంగతి తేల్చమని చంద్రబాబు పీకల మీద కూర్చున్నారు. దానికి తోడు మాదిగల వర్గీకరణ కోసం కాంగ్రెస్ పై దాడులు చేస్తున్న ఎమ్మార్పీయస్ కూ మహా కూటమి తరపున మద్దతు ప్రకటించి, దాని నాయకుడు మంద కృష్ణ మాదిగతో అవగాహన కుదుర్చుకుంటే బావుంటుందని కేసిఆర్ సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎమ్మార్పీయస్ కూడా చంద్రబాబును సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. దానికి వత్తాసు పలుకుతూ తెలంగాణాలో తమ కోటా సీట్లకు ఎసరు రాకుండా, కోస్తా ప్రాంత సీట్లు అడగాలని మంద కృష్ణ మాదిగకు లోపాయికారీ సలహను కేసీఆర్ ఇస్తున్నారని చెబుతున్నారు. కాని కోస్తా జిల్లాలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగేతర ఎస్ సి వర్గాలు ఎమ్మార్పీయస్ తో మహాకూటమి దోస్తీని వ్యతిరేకిస్తే మొత్తం కొంప కొల్లేరయిపోతుందనే ఆందోళన తెలుగుదేశం నాయకత్వంలో మొదలైంది. తెలుగుదేశం నాయకులకు అంతగా ఇష్టం లేకపోయినా తెలంగాణా ప్రాంతంలో తనకు కలిసివస్తుందనే ఎత్తుగడతో కేసీఆర్ పనిగట్టుకుని ఎమ్మార్పీయస్ ను మహాకూటమిలోకి తీసుకువస్తున్నారని, మహాకూటమి మద్దతుతో ఎమ్మార్పీయస్ స్వంతంత్ర గుర్తుతో పోటీకి దిగితే ఒనగూడే లాభమెంతో చంద్రబాబు అంచనా వేసుకోక పోతే మునిగిపోవడం ఖాయమని వారు వాదిస్తున్నారు.
ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ధ్యేయంతో చంద్రబాబు అందరినీ మహా కూటమిలోనికి ఆహ్వానించి సీట్లు పంచిపెట్టడం అసలు సిసలైన తెలుగుదేశం నాయకులకు రుచించడం లేదు. ఈసారైనా టిక్కెట్ దక్కుందనే గంపెడాశతో, పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ ఆరళ్లను తట్టుకుని, కేడర్ ను కాపాడుకుంటూ ఐదేళ్ళుగా తాము కష్టపడి పనిచేసిన నియోజకవర్గాన్ని తీరా ఎన్నికలొచ్చేసరికి ఎవరికో దారాదత్తం చేయడాన్ని తెలుగు తమ్ముళ్ళు భరించలేకపోతున్నారు. తెలుగుదేశాన్ని నమ్ముకుంటే మరీ జన్మలో తమకు అవకాశం దక్కడం కల్లే నని నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 9 March, 2009
|