థర్డ్ ఫ్రంట్ దూసుకొస్తోంది!
మిత్ర పక్షాల నుంచి బిజెపి పడుతున్న తలనొప్పులు కాంగ్రెస్ కు ఆనందకారకాలు అవుతున్నాయి. కాని ఇప్పుడు తన మిత్ర పక్షాలే కొన్ని తమకు 'తగిన విధంగా సీట్లు సర్దుబాటు చేయకపోతే' నవీన్ మార్గాన్ని అనుసరిస్తూ కారత్ 'పంచన' చేరే అవకాశం కనిపిస్తుండడం కాంగ్రెస్ కు నిద్రమత్తు వదిలించింది. కాంగ్రెస్ పట్ల అసంతుష్టి చెందుతున్న శక్తులకు ఇప్పుడు 'కాంగ్రెసేతర లౌకిక ప్రత్యామ్నాయం' అనే దుడ్డుకర్ర ఆయుధం కావచ్చు.
ప్రాంతీయ పార్టీలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడానికి వీలుగా జాతీయ స్థాయిలో పొత్తులు పెట్టుకోరాదన్న తన పాత వైఖరి కూడా బెడిసికొట్టవచ్చునని కాంగ్రెస్ గ్రహించింది. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్ సిపి వంటి ప్రాంతీయ సత్రకాయలకు తృతీయ ఫ్రంట్ తో అంటకాగేందుకు ఈ వైఖరి అవకాశం కల్పిస్తున్నది. ఎన్ సిపి ఇప్పటికే నవీన్ కు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, కాంగ్రెస్ దానిని సవాల్ చేయజాలదు. ఎందుకంటే యుపిఎ ఏర్పాటు జాతీయ స్థాయిది కాదు. తన ప్రాంతీయ పరిధికి వెలుపల తన అభీష్టం ప్రకారం నడచుకునే స్వేచ్ఛ ప్రతి భాగస్వామ్య పార్టీకీ ఉన్నది. కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్న ఇతర పార్టీల నేతలలో ఆర్ జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు.
రానున్న ఎన్నికల ఫలితాలు కనుక కారత్ ఫ్రంట్ కు 'బలమైన' పరిస్థితిని కలిగించి, 'సెక్యులరిజం' పేరిట ఫ్రంట్ కు తిరిగి ఆధిపత్యం లభిస్తే, 2008 జూలైలో తాను కాదు పొమ్మన్న వ్యక్తితోనే తిరిగి సర్దుకుపోవాలా వద్దా అనేది కాంగ్రెస్ తేల్చుకోవలసి వస్తుంది. కాంగ్రెస్ ఉమ్మడి బలం పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలలో కన్నా ఎక్కువగా ఉన్న నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో ఆ పార్టీ తృతీయ ఫ్రంట్ వివిధ రూపులలో ఎదుర్కొంటున్నది. కర్నాటకలో మార్చి 12న తుమకూరులో తమ ప్రచారానికి కారత్ ఫ్రంట్ శ్రీకారం చుడతారని హెచ్.డి. దేవెగౌడ ప్రకటించిన తరువాత జనతా దళ్ (సెక్యులర్)ను బుజ్జగించే ప్రయత్నాలకు కాంగ్రెస్ స్వస్తి పలికింది.
Pages: -1- 2 -3- News Posted: 10 March, 2009
|