థర్డ్ ఫ్రంట్ నిలబడేనా?
తృతీయ ఫ్రంట్ లో సాంప్రదాయకంగా కీలక స్థానం ఉన్న వామపక్షాల బలం వాటికి పెట్టని కోటలనదగిన బెంగాల్, కేరళ రాష్ట్రాలలో దెబ్బ తిని, తదుపరి లోక్ సభలో గణనీయంగా సీట్ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తున్న సమయంలో ఎన్నికల వినీలాకాశంలో తృతీయ ఫ్రంట్ ఛాయలు గోచరించడం విచిత్రమే. ఎన్నికలలో వామపక్షాల విజయావకాశాలు క్రమంగా హరించుకుపోతున్నప్పటికీ ఈ దఫా తృతీయ ఫ్రంట్ బరిలోకి దిగుతున్నదంటే, పట్టు వీడని విక్రముని వంటి ప్రాంతీయ పార్టీల మధ్య లోపాయికారీగా కుదిరిన ఒప్పందం కారణంగా కనిపిస్తున్నది. బిజెపి సారథ్యంలో ఒకటి, కాంగ్రెస్ నాయకత్వంలో మరొకటి అలా రెండు ప్రభుత్వాలు కేంద్రంలో పాలన సాగించిన తరువాత ఇక పాలన సాగించవలసిన వంతు తమదేనని ఆ ప్రాంతీయ శక్తులు దృఢంగా విశ్వసిస్తున్నాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత, కాంగ్రెస్ గాని, బిజెపి గాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా సీట్లను సంపాదించలేనప్పుడు మాత్రమే ఈ తృతీయ ఫ్రంట్ రూపుదిద్దుకుంటుంది. కాంగ్రెస్ వెలుపలి నుంచి ఇచ్చిన మద్దతుతో 1996 - 97 నుంచి పాలించిన, స్వల్ప కాలమే కొనసాగిన యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం వంటిదే కావచ్చు ఇది. లేదా పూర్తిగా భిన్నమైనదీ కావచ్చు. రెండు ప్రధాన పార్టీల సీట్ల సంఖ్య 250ని దాటని, ప్రాంతీయ సత్రకాయలకు అంకెల బలం ఉండే స్థితిలోనే ఇది రూపుదిద్దుకుంటుంది అంటే దీని అవకాశాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కష్టం.
వామపక్షాలకు అనుకూలమైన సంకీర్ణంపై కరత్ ఆశలన్నీ ఉత్తర ప్రదేశ్ లో 50 పైచిలుకు సీట్లు సంపాదించి మాయావతి ప్రధాని పదవి తనకే దక్కాలని కోరుకోవడంపైనే ఆధారపడి ఉంటాయి. అయితే, ఈ సస్పెన్స్ ను అలా కొనసాగించేందుకు ఇతర కూడికలు, తీసివేతలు కూడా జరగవచ్చు. ఉదాహరణకు ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ (ఎస్ పి), ఎఐఎడిఎంకె, బిజెడి మొదలైన పార్టీలతో కూడిన సంకీర్ణానికి శరద్ పవార్ సారథ్యం వహించవచ్చు. మరొక వైపు వివిధ ఎన్ డిఎ భాగస్వామ్య పక్షాలు, ఎఐఎడిఎంకె, బిజెడి వంటి ఇతర పార్టీలతో కూడిన సంకీర్ణానికి నాయకత్వం వహించేందుకు నితీశ్ కుమార్ కూడా పోటీ పడవచ్చు.
Pages: -1- 2 -3- News Posted: 12 March, 2009
|