'రాజ్యం'లో 'దేశం' కోవర్టులు?
హైదరాబాద్: రాజమండ్రిలో సామాజిక శంఖారావం సభ అమోఘంగా విజయవంతం కావడంతో ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి) అధ్యక్షుడు చిరంజీవి తెలుగుదేశం పార్టీపై మాటల ద్వారా అగ్నివర్షమే కురింపించారు. ఆయన తెలుగు దేశం పార్టీ (టిడిపి)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన, తన పార్టీ ప్రతిష్ఠను మంటగలపడానికి కోవర్టులుగా కొందరిని పార్టీలో 'ప్రవేశపెట్టింద'ని టిడిపిపై ఆయన విరుచుకుపడ్డారు. చిరంజీవి విలేఖరులతో మాట్లాడుతూ, తెలుగు దేశం పార్టీ వారు కొందరు కోవర్టులను ప్రజారాజ్యంలో ప్రవేశపెట్టారని, వార అనవసరమైన ఆరోపణలు చేయడం ద్వారా తమకు నష్టం కలిగించజూస్తున్నారని అన్నారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రతి ఆశావహుని వద్ద పిఆర్ పి రూ. 2 కోట్లు వసూలు చేస్తున్నదనే ఆరోపణను చిరంజీవి తోసిపుచ్చుతూ, 'అదందా వట్టిది. పిఆర్ పిలో టిడిపి ప్రవేశపెట్టిన కోవర్టులు కొందరు అటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి శక్తులు పిఆర్ పి నుంచి బయటకు వెళ్ళిపోయాయి' అని పేర్కొన్నారు.
ప్రజారాజ్యం పార్టీ విజయవాడ అర్బన్ కన్వీనర్ గా నియమితులైన కేశినేని శ్రీనివాస్ (నాని) రూరల్ కన్వీనర్ ముత్తంశెట్టి విజయనిర్మల, ఆమె భర్తపైన జనవరి 26న ఒక కార్యక్రమంలో తన మనుషుల చేత దాడి చేయించి వార్తలకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై పార్టీ క్రమశిక్షణా సంఘం నాని, విజయనిర్మలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నాని షోకాజ్ నోటీసుకు సమాధానం పంపించడానికి బదులుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పార్టీ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే నానీ తమ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాలేదని, తెలుగుదేశం పార్టీ కోవర్టుగా మాత్రమే అతను పార్టీలో చేరాడని గ్రహించిన పార్టీ అధినాయకత్వం అతనిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించింది. తదనంతరం నానీ ఇటీవలే చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
అలాగే ప్రజారాజ్యం తూర్పు గోదావరి జిల్లా శాఖ కో కన్వీనర్ గా వ్యవహరించిన వాసంశెట్టి సత్య ఇటీవలే పార్టీపై ఉన్నట్టుండి తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అనంతరం పార్టీ అయనను బహిష్కరించడంతో ఆయన కూడా తన అనుచరులను వెంటబెట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇవి తాజా పరిణామాలు కాగా ఇంతకు మునుపు కూడా ప్రజారాజ్యం పార్టీకి ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. దీంతో పార్టీలో కొత్తగా చేరిన వారిని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకత్వంపై అనుమాన మేఘాలు ముసురుకున్నాయి.
Pages: 1 -2- -3- News Posted: 12 March, 2009
|