బీహార్ లోని 40 సీట్లలో కనీసం 25 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేయగలదని తెలిసినప్పుడు తన కార్యకర్తలు 'ఉబ్బితబ్బిబ్బు అయ్యారు' అని బీహార్ ఎంపి ఒకరు చెప్పారు. మహారాష్ట్రలో ఎన్ సిపితో సంబంధాలను కాంగ్రెస్ నాయకులు తెగతెంపులు చేసుకోవాలని పార్టీ రాష్ట్ర శాఖ కోరుతున్నది. రెండు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలలో విడివిడిగానే పోటీ చేశాయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు.
2004లో కన్నా ఒక సీటును ఎక్కువ కేటాయించడానికి కాంగ్రెస్ అంగీకరించిన తరువాత పొత్తు ఒప్పందంపై సంతకాల ప్రక్రియ ఒక ప్రకటన కోసం నిరీక్షిస్తున్నది. ఎందుకంటే ఎన్ సిపితో కలసి పని చేయబోమని కాంగ్రెస్ జిల్లా శాఖలు హెచ్చరించాయి. పార్టీ కార్యకర్తల 'మనోభావాలను' మహారాష్ట్ర ఇన్ చార్జి అయిన కేంద్ర మంత్రి ఎ.కె. ఆంటోనీకి రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తెలియజేశారు. కాని 'ఇప్పటికే సమయం మించిపోయింది. ఏమీ చేయలేం' అని ఆంటోనీ అన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) పరిస్థితి 'అస్తవ్యస్తం'గా ఉన్నందున ఈ ఎన్నికలలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ నమ్ముతున్నందున పొత్తుల విషయమై పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది.