ప్రైవేట్ జెట్ నయం
ముంబై : ప్రైవేట్ జెట్ విమానాన్ని ధనికులు మాత్రమే సొంతంగా కలిగి ఉంటారని ఎవరైనా భావిస్తుంటే వారు ఆ అభిప్రాయాన్ని మార్చుకోవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా ప్రైవేట్ జెట్ విమానాల ధరలు బాగా పతనమయ్యాయి. విమానం ఎంత పాతదనే విషయాన్ని అంతగా పట్టించుకోకపోతే అవి 22 వేల డాలర్లు (రూ. 11 లక్షలు) మేరకు తక్కువ ధరలోనే లభ్యం కావచ్చు. అయితే, అటువంటి పాత విమానాన్ని కొనుగోలు చేసినవారు దాని నిర్వహణకు బాగానే ఖర్చు చేయవలసి రావచ్చు. ఇక ఎంచుకోవడానికి రకరకాల విమానాలు ఉన్నాయి. పైపర్ లేదా సెస్నా, బెల్ లేదా బీచ్, రాబిన్సన్ లేదా మూనీ. ఈ విమానాల ఉత్పత్తి తేదీ, గగన ప్రయాణ యోగ్యతను బట్టి, వీటిని 22 వేల డాలర్లు (రూ. 11 లక్షలు), 3 లక్షల డాలర్లు (రూ. 1.5 కోట్లు) మధ్య శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు.
ఇంత తక్కువ ధరకు వీటిని విక్రయించడానికి కారణం? పాత విమానాలు కుప్పలుతెప్పలుగా ఉండడమే. అంతర్జాతీయ పౌర విమానయాన పరిశ్రమ సమాచారం ప్రకారం, ఒక్క అమెరికాలోనే అమ్మకానికి లేదా తుక్కు కింద వదలివేయడానికి సిద్ధంగా ఉన్న పెద్ద, మధ్య తరహా, చిన్న తరహా విమానాలు ఏడు వేలకు పైగా ఉన్నాయి. కాని వాటిని కొనేవారే కరవయ్యారు. యూరప్, ఆసియా దేశాలలో కూడా కొనుగోలుదారుల కోసం ఎదురుతెన్నులు చూస్తున్న విమానాలు 3000 ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 100 పైచిలుకు విమానాల బ్రోకర్ సంస్థలు విడుదల చేసిన ఆన్ లైన్ ప్రకటనల ద్వారా ఈ విషయం విదితం అవుతున్నది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న విమానాలలో ఎగ్జిక్యూటివ్ జెట్ లు, టర్బోప్రాప్ విమానాలు, పిస్టన్ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర చిన్న విమానాలు ఉన్నాయి. వీటి బ్రాండ్ లలో మెక్ డనెల్ డగ్లస్, గల్ఫ్ స్ట్రీమ్, సెస్నా, పైలాటస్, పైపర్, రాబిన్సన్, బొంబార్డియర్, బీచ్, బెల్ ఉన్నాయి.
Pages: 1 -2- -3- News Posted: 6 April, 2009
|