న్యూఢిల్లీ : గుజరాత్ సహాయ నిధి పేరిట వసూలు చేసిన నిధులను భారతీయ జనతా పార్టీ (బిజెపి) సొంతానికి ఖర్చు చేసిందా? కాంగ్రెస్ పార్టీకి ఆదాయం పన్ను (ఐటి) మినహాయింపును మంజూరు చేయడానికి ఐటి శాఖ ఎందుకు అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకున్నది? భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) నాయకులు పార్టీ నిధులతో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలలో వాటాల కొనుగోలును ఏవిధంగా సమర్థించుకోగలరు? దివాళా తీసిన లేదా స్వల్పమాత్రంగా నిధులు ఉన్న స్థితిలో రాజకీయ పార్టీలు బీహార్ లో ఎలా ఎన్నికలలో పోటీ చేయగలిగాయి?
పన్ను మినహాయింపును కోరుతూ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు దాఖలు చేసిన ఐటి రిటర్న్ లను 'డిఎన్ఎ' వార్తా సంస్థ కూలంకషంగా విశ్లేషించినప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఈ రిటర్న్ లు అనేక సంవత్సరాలుగా గోప్యంగానే ఉండిపోయాయి. కాని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను మెరుగుపరచడానికి పాటుపడుతున్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ (ఎన్ జిఒ) 'ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్)' చేసిన విజ్ఞప్తులు, ఇతర విధాలుగా జరిగిన కృషి ఫలితంగా ఈ వివరాలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. డిఎన్ఎ వార్తా సంస్థ చాలా రోజులుగా నిపుణుల సాయంతో ఈ రిటర్న్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఆ క్రమంలో దిగ్భ్రాంతి కలిగించే అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. ఐటి శాఖ ఈ రిటర్న్ లను పరిశీలించేటప్పుడు ఎంత అలసత్వంతో వ్యవహరిస్తోందో దీని వల్ల తెలియవచ్చింది. పలు రాజకీయ పార్టీలు తమ ఐటి రిటర్న్ లలో చేసిన క్లెయిములలో అంతరాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని, దివాళా తీసిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) ఎప్పటికప్పుడు బీహార్ లో ఎన్నికలలో ఎలా పోటీ చేయగలుగుతోంది? ఏవో కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్న జనతా దళ్ (యునైటెడ్)కు బీహార్ లో ఎన్నికలలో పోటీ చేయడం ఎలా సాధ్యం అవుతోంది?