జెపికి వోటర్ల 'జయ' హో
హైదరాబాద్ : ఒక పక్క ఎండ మండుతుండగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలు దాటిన తరువాత కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లోని మోతీ నగర్ డివిజన్ బాలాజీ స్వర్ణపురి (బిఎస్ పి) కాలనీలో ప్లానెట్ ఎం ఎదురుగా దాదాపు 200 మంది యువకులు, మహిళలు సమీకృతం అయ్యారు. మహిళలు మాటా మంతి సాగిస్తున్నారు. కాలనీ వాసులు తమ ఇళ్ళ కిటికీలు, బాల్కనీలలో నుంచి కింద సమీకృతమైన యువకులను గమనిస్తున్నారు. 'ఓపిక పట్టండి. జెపి గారు ఏ క్షణాన్నైనా ఇక్కడికి రాగలరు' అని మధ్యవయస్కురాలు లక్ష్మి నవ్వుతూ అన్నారు. యువకులు ఈలలు వేస్తున్నారు. యువతులు కూడా తక్కువ తినలేదు. లక్ష్మి కూడా ఈల వేశారు. మరి ఎందుకు వేయరు? ఈల లోక్ సత్తా పార్టీ ఎన్నికల గుర్తు కదా! రెండు నిమిషాల అనంతరం కొన్ని నాలుగు చక్రాల వాహనాలు వచ్చి ఆగాయి. 'ఇదిగో జెపి గారు వచ్చారు' అని ఎవరో అరిచారు. జనం ఒక్కసారిగా ఒక కారు వైపు కదిలారు. ఆ కారులో నుంచి ఒక పొడగరి, సన్నటి పెద్ద మనిషి తన అభిమానుల శుభాకాంక్షలు స్వీకరిస్తూ దిగారు. కొందరితో కరచాలనం చేసి, మరికొందరితో కలసి ఫోటోలు దిగిన తరువాత ఆయన ఆ సమీపంలో నిలచి ఉన్న ప్రచార రథంపైకి ఎక్కారు.
ముడతలు పడని తెల్లటి షర్ట్, నల్ల ప్యాంటు ధరించిన లోక్ సత్తా పార్టీ (ఎల్ఎస్ పి) అధ్యక్షుడు, కూకట్ పల్లి శాసనసభ స్థానానికి అభ్యర్థి డాక్టర్ జయప్రకాశ్ నారాయణకు, సాంప్రదాయక నేతకు మధ్య దుస్తుల విషయంలో గాని, అలవాట్లలో గాని కొద్దిగా కూడా పోలిక ఉండదు. 'వోటు మాకు, అధికారం మీకు'. ఆయన అక్కడ చేరిన జనసమూహాన్ని ఉద్దేశించి అన్న తొలి పలుకులు అవి. అక్కడి జనం కొన్ని క్షణాలలోనే రెట్టింపయ్యారు. ఆయన మాటలకు వారంతా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు.' బుల్లెట్ కన్నాబ్యాలట్ మరింత శక్తిమంతమైనది. పోలింగ్ రోజును మరొక సెలవు దినంగా భావించకండి. బాగా ముందుగానే పోలింగ్ కేంద్రాలను సరి చూసుకుని మీ వోటు హక్కును వినియోగించుకోవడానికై ఆ రోజు అక్కడికి వెళ్ళవలసిందిగా వోటర్లను ముఖ్యంగా మహిళలకు, యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వోటు వేయకపోయినట్లయితే మీరు దేశాన్ని అంధకారంలోకి నెట్టుతున్నట్లే' అని ఆయన తన ప్రచార రథం నెమ్మదిగా ముందుకు సాగుతుండగా అన్నారు.
Pages: 1 -2- -3- News Posted: 14 April, 2009
|