కోస్తా ఎవరి కొమ్ము కాసేను?
విజయవాడ: ప్రధాన రాజకీయ పార్టీలకు ఎంతో ప్రతిష్టాకరంగా మారిన కోస్తా ఆంధ్రలో, పోలింగు ముగిసి మూడు రోజులైనా, ఓటరు నాడి ఎవరికీ అంతు పట్టడం లేదు. అభ్యర్దులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. పైకి మాత్రం ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమాగా చెబుతున్నారు. కోస్తా ఆంధ్రకు సంబంధించి తొమ్మిది జిల్లాల్లో మొత్తం 123 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో పోటీ చేసిన 12 మంది రాష్ట్ర మంత్రులు, ముగ్గురు కేంద్ర మంత్రులలో ఏ ఒక్కరూ గెలుస్తామని ఖచ్చితంగా చెప్పగలిగే స్థితిలో లేరు. క్రాస్ ఓటింగు కారణంగా స్వల్ప ఆధిక్యతతోనైనా బయటపడగలమని కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురందరేశ్వరి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విశేషమేమిటంటే, కాంగ్రెస్ కు చెందిన కాపు వర్గీయులు ఎక్కువ శాతం అసెంబ్లీ ఓట్లను ప్రజారాజ్యం పార్టీకి వేసి, పార్లమెంటు ఓట్లుమాత్రం కాంగ్రెస్ అభ్యర్ధులకు వేశారు.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 10 సీట్లు వచ్చే అవకాశాలుండగా, పార్లమెంటు స్థానం ఒక్కటైనా దక్కే సూచనలు లేవు. కాంగ్రెస్ పార్టీకి కోస్తా ఆంధ్ర మొత్తమ్మీద ఒక్క ప్రకాశం జిల్లాలోనే అత్యధిక స్థానాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ఎనిమిదింటిని గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం మూడు, ప్రజారాజ్యం ఒకటి గెలుచుకోవచ్చు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి పట్ల వ్యతిరేకత, అభ్యర్ధుల ఎంపికలో ఆయన అతిజోక్యం ఆ పార్టీని చావుదెబ్బ తీశాయని పరిశీలకులు అంటున్నారు. అసలు బలరాం గెలుపొందే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 26 April, 2009
|