సంతానంపై 'కరుణ'
తన మొదటి భార్య పద్మావతి 1948లో మరణించినప్పుడు కరుణానిధి తన తల్లిదండ్రులు ఎంపిక చేసిన దయాళును వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆయన 1960 దశకం మధ్యలో కవి కణ్ణదాసన్ నడుపుతున్న నాటక సమాజం సభ్యురాలైన రాజాత్తిని పెళ్ళి చేసుకున్నారు. విచిత్రంగా రాజాత్తి పేరు ఒకసారి అసెంబ్లీ రికార్డులలో చోటు చేసుకున్నది. ఆలివర్ రోడ్ లోని ఇంటిలో ఎవరితో కలసి నివసిస్తున్నారని ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధిని అప్పట్లో ప్రశ్నించారు. (ఆ ఇంటికి ఆయన అధికారికంగా అద్దె వసూలు చేస్తున్నారు.) కరుణానిధి ఏ తొట్రుపాటు లేకుండానే 'నా కుమార్తె కనిమొళి తల్లితో' అని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే రాజాత్తిని తన భార్యగా ఆయన అధికారికంగా పేర్కొనలేరు.
ఇప్పటికీ కరుణానిధి సగం రోజు గోపాలపురంలోని తన అధికార నివాసంలోను, రెండవ పూట సిఐటి కాలనీలోని రాజాత్తి విలాసవంతమైన భవంతిలోను గడుపుతుంటారు. రెండు నివాసాల మధ్య దూరం ఒక కిలో మీటరు కూడా ఉండదు.
చివరకు వార్తాపత్రికలు, ఆహ్వానపత్రాలలో కూడా ఆ ఇద్దరు మహిళల గురించి వినూత్న పద్ధతిలో ప్రస్తావిస్తుంటారు. దయాళును కరుణానిధి భార్య (తమిళంలో మనైవియార్)గాను, రాజాత్తిని సహచరి (తమిళంలో తుణైవియార్)గాను పేర్కొంటుంటారు.
ఆ రెండు కుటుంబాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కాలక్రమేణా సమసిపోయింది. ఇటీవల శ్రీలంకలో యుద్ధం విషయమై కరుణానిధి ఒక పూట నిరాహార దీక్షకు ఉపక్రమించినప్పుడు ఆయన భార్యలు ఇద్దరూ ఆయనకు పక్కనే ఆశీనులయ్యారు. రాజాత్తి ఆయన తల వద్ద, దయాళు ఆయన పాదాల వద్ద కూర్చున్నారు.
డిఎంకె వృద్ధనేతతో మారన్ సోదరులు దూరమైనప్పుడు ఎక్కువగా మానసిక వ్యథ చెందింది కరుణానిధి మరొక కుమార్తె సెల్వి. ఎందుకంటే ఆమె మురసోలి మారన్ చిన్న తమ్ముడు సెల్వంను వివాహం చేసుకున్నారు. ఉభయ పక్షాల మధ్య సంధి కుదర్చడానికి సెల్వి శక్తివంచన లేకుండా కృషి చేశారు. దయాళును అపోలో ఆసుపత్రిలో చేర్పించిన సందర్భంలో ఆమె, అళగిరి కుమార్తె కలుసుకున్నప్పుడు ఈ విభేదాలు పరిష్కారమయ్యాయి.
Pages: -1- 2 -3- News Posted: 23 May, 2009
|