పాక్ పైనే ఇండియా ఆశలు
పాకిస్తాన్ మ్యాచ్ లో 10 ఓవర్లలో 71 పరుగులు ఇచ్చుకున్న ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ ఈ పోటీలో కూడా తన శైలిలో నియంత్రణ సాధించలేకపోయాడు. అతని బౌలింగ్ లో పరుగుల వరద పారింది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మన్ లు అతని బౌలింగ్ లో వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించకుండా తాము కోరుకున్నప్పుడల్లా సింగిల్స్ చేశారు.
యూసుఫ్ పఠాన్ స్థానంలో జట్టులోకి వచ్చి తన తొలి గేము ఆడుతున్న లె గ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా బంతిపై పట్టు సాధించి మెలికలు తిప్పగలిగాడు. అతను త్వరగానే ఆసీస్ రెండవ వికెట్ ను పడగొట్టగలిగాడు. పైన్ 56 వ్యక్తిగత పరుగుల స్కోరు వద్ద అమిత్ బంతిని స్వీప్ చేయబోయాడు గాని బంతి బ్యాట్ అంచుకు తగిలి మిడ్ వికెట్ స్థానంలో ఉన్న హర్భజన్ సింగ్ కు క్యాచ్ వెళ్ళింది.
సుదీర్ఘ సమయం వికెట్ల వద్ద పాతుకుపోవడానికి సిద్ధపడినట్లుగా కనిపించిన ఆసీస్ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ మంచి ఫామ్ లో ఉన్నట్లుగా కనిపించాడు. అతను ప్రవీణ్ కుమార్ బంతిని అనాయాసంగా లాంగాన్ మీదుగా సిక్సర్ కు కొట్టాడు. తన అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని రంగరించి పాంటింగ్ ఆఫ్ సైడ్ ఫీల్డ్ లో ఖాళీలను కనిపెట్టి పరుగులు స్కోరు చేసి రన్ రేట్ పెంచాడు. మైకేల్ హుస్సీతో జతగా మూడవ వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పాంటింగ్ భారీ సెంచరీ చేస్తాడని అనుకుంటున్న సమయంలో విచిత్రంగా తన వికెట్ ను కోల్పోయాడు.
హుస్సీ బంతిని స్వీపర్ కవర్ మీదుగా కొట్టి రెండు పరుగులకు ఉపక్రమించాడు. అతని పిలుపునకు స్పందించిన పాంటింగ్ ఒక పరుగు పూర్తి చేశాడు కాని రెండవ పరుగును పూర్తి చేసే లోపే గౌతమ్ గంభీర్ బౌండరీ లైన్ నుంచి విసిరిన బంతి నాన్ స్ట్రైకర్ వైపు స్టంపులను పడగొట్టాడు. ఆ విధంగా పాంటింగ్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు.
Pages: -1- 2 -3- News Posted: 29 September, 2009
|