అన్నతో అనిల్ రాజీ!
స్వర్గీయ ధీరూభాయ్ అంబానీకి విశ్వాసపాత్రుడు, బాల్యం నుంచి అంబానీ సోదరుల పెంపకాన్ని చూసిన వారి కుటుంబానికి సన్నిహితుడు ఒకరు 'ఫైనాన్షియల్ క్రానికల్' విలేఖరితో మాట్లాడుతూ, 'సోదరులిద్దరూ తమ పోరును చివరకు శ్మశానానికి కూడా తీసుకువెళతారు. ముఖేష్ తగ్గాలని అనుకున్నా ఆయన తగ్గగలరా' అని అన్నారు. ఆర్ఐఎల్ లో తమ సొమ్ము మదుపు చేసిన లక్షలాది మంది పెట్టుబడిదారులను ఉద్దేశించి ఆయన అలా అన్నారు. అనిల్ నిజంగా చిత్తశుద్ధితో ఈ రాజీ ప్రతిపాదన చేశారని ఆయన భావించడం లేదు. నిర్దుష్ట కారణాలతో తన ప ేరు వెల్లడికి ఇష్టపడని ఆ సహాయకుడు ఇంకా మాట్లాడుతూ, 'ఆయన (అనిల్) నిజంగా కోరుకుంటున్నట్లయితే, ఆయన కోర్టు కేసులన్నిటినీ ఉపసంహరించుకుని, తన అన్నగారి దగ్గరకు వెళ్ళి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుని ఉండేవారు' అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆర్ఐఎల్ ప్రకటనలో కూడా ఇదే అభిప్రాయం కానవచ్చింది. అనిల్ చిత్తశుద్ధిని సంస్థ అనుమానిస్తున్నది. 'దురదృష్టవశాత్తు, ఆర్-ఆదాగ్ ఇంతవరకు వ్యవహరించిన తీరును బట్టి, అనిల్ నిజంగా మారారని ఆర్ఐఎల్ విశ్వసించలేకపోతున్నది. చాలా సంవత్సరాలుగా ఆయన ఆర్ఐఎల్ పైన, సంస్థ చైర్మన్ పైన దుష్ప్రచారం సాగించారు. ఆ ప్రచారం భారతదేశ కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా విషపూరిత ప్రకటనల ద్వారా ఇటీవలి నెలలలో పరాకాష్ఠకు చేరుకున్నది' అని ఆర్ఐఎల్ తన ప్రకటనలో వివరించింది.
అనిల్ 'స్వయంగా నేరుగా తన అన్నగారితో మాట్లాడి ఉండడానికి' బదులు బహిరంగ ప్రకటన ద్వారా ముఖేష్ కు తన సందేశం పంపడానికి అనిల్ మరొకసారి ప్రయత్నించడం 'విచారాన్ని, దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది' అని ఆర్ఐఎల్ వ్యాఖ్యానించింది. అనిల్ కు చిత్తశుద్ధి ఉన్నట్లయితే, ఆయన దానిని క్రియలో చూపించాలని సంస్థ సూచించింది.
కాగా, సోదరులిద్దరి మధ్య సంధి కుదిరే అవకాశాలు నూటికి ఒక శాతమో రెండు శాతమో ఉంటుందని విశ్లేషకులు, మార్కెట్ పరిశీలకులు ఊహిస్తున్నారు. అయితే, పోరును ప్రారంభించిందీ, శాంతికి ప్రతిపాదన చేసిందీ అనిల్ కనుక ఈ విషయంలో చొరవ తీసుకోవలసింది ఆయనేనని వారు భావిస్తున్నారు. వారి మధ్య వెంటనే రాజీ కుదరడం అనుమానమేనని వారంటున్నారు. స్వతంత్ర మార్కెట్ కన్సల్టెంట్, ఆర్ఐఎల్ పరిశీలకుడు ఎస్.పి. తుల్సియాన్ 'ఫైనాన్షియల్ క్రానికల్' విలేఖరితో మాట్లాడుతూ, 'దీపావళికి ముందుగా అన్ని వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఉభయ వర్గాలు ఆచితూచి ఈ అడుగు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఆయన (ముఖేష్) ఈ రాజీ ప్రతిపాదనకు అంగీకరిస్తారా లేక కోర్టు విచారణ ప్రారంభమయ్యేంత వరకు నిరీక్షిస్తారా అనేది మనం వేచి చూడవలసి ఉంటుంది' అని అన్నారు.
Pages: -1- 2 News Posted: 12 October, 2009
|