దక్షిణాధి భాషల్లో '3 ఇడియట్స్'

రాజ్ కుమార్ హిరాని '3 ఇడియట్స్' చిత్రం బాలీవుడ్ సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తూ 'షోలే' నాటి రోజులను గుర్తుచేస్తుండటంతో వివిధ భాషల్లో ఆ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు నిర్మాతలు పోటీపడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రీమేక్ కు దక్షిణాదికి చెందిన రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీపడుతుండగా, నాలుగు దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేసేందుకు జెమినీ ఫిలిం సర్క్యూట్స్ సంస్థ ఇప్పటికే 10 నుంచి 15 కోట్ల రూపాయల భారీ ఆఫర్ తో సంప్రదింపులు జరుపుతోంది. జెమినీ ఫిలిం సర్క్యూట్స్ సంస్థ గతంలో రాజ్ కుమార్ హిరానీ తీసిన 'మున్నాబాయ్ ఎం.బి.బి.ఎస్' చిత్రాన్ని తమిళంలో 'వసూల్ రాజా ఎంబిబిఎస్', తెలుగులో 'శంకర్ దాదా ఎంబిబిఎస్'గా రీమేక్ చేసింది. రెండు భాషల్లోనూ ఆ చిత్రాలు విజయం సాధించాయి.
'3 ఇడియట్స్' చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్ కోసం ఇప్పటికే నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజు హిరానీతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని జెమినీ ఫిలిమ్స్ కు చెందిన మనో అక్కినేని ధ్రువీకరించారు. అయితే నటీనటులు ఎవరనేది ఇంకా అనుకోలేదని ఆయన వివరించారు. అయితే ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు రీమేక్ వెర్షన్లలో నటించేందుకు తమ సుమఖత వ్యక్తం చేసినట్టు పుకార్లు షికారు చేస్తున్నారు. హిందీ వెర్షన్ లో ఒక 'ఇడియట్'గా తాను పోషించిన పాత్రను తమిళంలోనూ పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాధవన్ స్పష్టం చేశారు. అమీర్ ఖాన్ పాత్రను తమిళంలో సూర్య పోషించనున్నారని వినిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు డేట్లు ఇవ్వలేనంటూ ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారట. దీంతో ఈ పాత్రను విజయ్ చేత చేయించాలనే ఆలోచనలో ఫిల్మ్ మేకర్స్ ఉన్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. సూర్యను ఈ విషయమై సంప్రదించినప్పుడు, తనకెంతో నచ్చిన చిత్రం '3 ఇడియట్స్' అనీ, అయితే తమిళంలో రీమేక్ చేయాలంటే దర్శకుడు చాలా గట్టివాడై ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Pages: 1 -2- News Posted: 9 January, 2010
|