ఆంగ్లో డచ్ స్టీల్ సంస్థ కోరస్ ను 2007 ప్రారంభంలో దాదాపు 13 బిలియన్ డాలర్లకు టాటా సంస్థ కొనుగోలు చేసిన ఫలితంగానే ఈ రుణభారం చాలా వరకు పెరిగింది. ఈ అధిక రుణభారం వల్ల సంస్థ ఆర్థిక చార్జీలు 36 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో సంస్థ ఆర్థిక చార్జీలు రూ. 1150 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తున్నది.
'గణనీయంగా లాభాలు ఆర్జించగల మా వృద్ధి ప్రాజెక్టులలో మరింత ఈక్విటీ పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఉన్న పక్షంలో తగిన సమయంలో అలా పెట్టుబడి పెట్టే విషయం పరిశీలిస్తాం' అని టాటా స్టీల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కౌశిక్ చటర్జీ శుక్రవారం విశ్లేషకులతో చెప్పారు. 'తిరిగి చెల్లింపుల కోసం అంతర్గతంగా కొంత నగదు ఉండడానికి దీని వల్ల అవకాశం ఉంటుంది' అని ఆయన అన్నారు. ఈ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6600 కోట్ల అప్పును ముందుగానే చెల్లించింది. అంతర్గత నిధుల సమీకరణ ద్వారా ప్రస్తుత త్రైమాసికంలో రూ. 1600 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు రుణాన్ని తిరిగి చెల్లించాలని సంస్థ యోచిస్తున్నది.