ఏసీలు మండుతాయ్
గోద్రెజ్ గృహోపకరణాల సంస్థ తమ ఉత్పత్తులపై రెండు నుండి మూడు శాతం ధరను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఉత్పత్తుల తయారీకి భారీ మొత్తంలో వ్యయం అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జార్జి మెనిజస్ స్పష్టం చేశారు. రానున్న బడ్జెట్ లో ప్రభుత్వం తమకు గతంలో ప్రకటించిన ఉద్దీపనలను తిరిగి కొనసాగించకపోతే మరోసారి ఉత్పత్తులపై ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొన్నదని ఆయన వివరించారు. గత త్రైమాసికంలో వాణిజ్య ఉత్పత్తులకు వినియోగించే ముడిసరుకుల వ్యయం 15 నుండి 18 శాతం పెరిగిందని, దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో తామూ ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
వీడియోకాన్ గృహోపకరణాల సంస్థ కూడా తమ ఉత్పుత్తుల ధరలు పెంచే బాట పట్టింది. ఇప్పటికే తమ అన్ని ఉత్పత్తులపై 5 శాతం ధరలు పెంచింది. మరికొన్ని ప్రత్యేక వస్తువులపై 6 నుండి 6.5 శాతం వరకు పెంపు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ కు ముందు మరోసారి వీడియోకాన్ ఉత్పత్తులు పెరిగే అవకాశాలు లేకపోలేదని ఆ సంస్ద ప్రతినిధులే స్వయంగా ప్రకటించారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. త్వరలో భారీగా పన్నులు పెంచే అవకాశం ఉందని, మరోవైపు ఉత్పత్తి వ్యయం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ధరలు పెంచక తప్పడం లేదని వీడియోకాన్ వైస్ ప్రెసిడెంట్ సి.ఎం.సింగ్ తెలిపారు. ముడిసరకుల వ్యయం పెరగడం, పన్నుల భారం, ఉద్దీపన ప్యాకేజీలు లేకపోవడం కలగలసి ధరల పెంపునకు కారణమయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రంలో తాజాగా వ్యాట్ శాతాన్ని కూడా పెంచడంతో తాము టెలివిజన్ సెట్ల ధరలను భారీమొత్తంలో పెంచినట్లు చెప్పారు.
Pages: -1- 2 News Posted: 17 February, 2010
|