'మై నేమ్ ఈజ్ ఖాన్' ఖాళీ?
ముంబై: షారూక్ ఖాన్, కాజల్ జంట మరోసారి 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రంతో సక్సెస్ పుల్ పెయిర్ అనిపించుకున్నారనీ, రికార్డ్ స్థాయిలో ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టుకుంటోందనీ వార్తలు వస్తున్న తరుణంలో ఇందుకు భిన్నంగా థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. వారాంతంలో ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు 90 నుంచి 100 శాతం వరకూ ప్రేక్షకులతో కిటకిటలాడిన థియేటర్లు ఇప్పుడు కేవలం 30 నుంచి 35 శాతం ప్రేక్షకులతో మాత్రమే దర్శనమిస్తున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లో పాకిస్తానీ ప్లేయర్స్ కు చోటు కల్పిస్తానని షారూక్ వ్యాఖ్యలు చేయడం, దీనిపై శివసేన మండిపడి ముంబై, మహారాష్ట్రలో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించడం ఈ చిత్రానికి కావాల్సినంత ప్రీ-రిలీజ్ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.
'సినిమా ఎలాగుందనే క్యూరియాసిటీతో వారాంతంలో థియేటర్లు కిటకిటలాడాయి. అయితే వారం రోజులు పూర్తయ్యే సరికి 35 శాతం కలెక్షన్లు పడిపోయాయి' అని బిగ్ సినిమాస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. మెట్రోస్ లో ఈ చిత్రం ఇప్పటికీ బాగా ఆడుతున్నప్పటికీ నాన్-మెట్రోస్, చిన్నచిన్న సిటీల్లో ఆ ఊపు తగ్గిందనీ, చిత్ర కథాంశం సీరియస్ గా ఉండటమే ఇందుకు కారణనీ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వారాంతానికి కలెక్షన్లు మళ్లీ పికప్ అవుతాయనే నమ్మకంతో తాము ఉన్నట్టు చెప్పారు. ఫన్ సినిమాస్ సిఓఓ విషాల్ కపూర్ దీనిపై ముచ్చటిస్తూ, ఈ చిత్రం సింగిల్ స్క్రీన్స్ ఆడియెన్స్ కంటే మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు బాగా దగ్గరగా ఉంటుందనీ, సింగిల్ స్క్రీన్స్ లో బాగా ఆడకపోవడానికి ఇదో కారణం కావచ్చనీ అన్నారు. '3 ఇడియట్స్' వారంతం థియేటర్ ఆక్యుపెన్సీ కంటే 'మై నేమ్ ఈజ్ ఖాన్' ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో 9/11 దాడుల అనంతరం ఒక ముస్లిం కుర్రాడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
Pages: 1 -2- News Posted: 18 February, 2010
|