పాత రోత కాదు 'పసిడి' అగ్ర స్థానానికి మన ఉత్థానానికి ఉప శీర్షికగా 'యువ భారతం' ఎంతగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ మన జట్టును ఆదుకున్నది, ముందుకు సాగేట్లు చేసింది పాత తరమే. సెహ్వాగ్ స్వైరవిహారం కానీయండి, చివరకు కొత్త క్రికెటర్ కూడా సిగ్గుపడే రీతిలో సచిన్ టెండూల్కర్ ప్రదర్శిస్తున్న పరుగుల దాహం కానీయండి ఇది 'వృద్ధ భారత్' విజయమేననాలి. పాత ఇప్పటికీ బంగారమేనని వివిఎస్ లక్ష్మణ్ మరింతగా నిరూపించాడు. వికెట్ తీసిన ప్రతిసారి మితిమీరిన ఉత్సాహాన్ని ప్రదర్శించే హర్భజన్ కూడా 'కొత్త తరాని' కన్నా 'పాత తరాని'కి చెందినవాడని ఎవరైనా పేర్కొన్నా అభ్యంతరం చెప్పకపోవచ్చు.
ఎంతో ప్రశాంత చిత్తంతో జట్టుకు సారథ్యం వహించే, అదే రీతిలో బ్యాట్ చేసే ధోని పాత, కొత్త తరాల మధ్య వారధి. మున్ముందు కూడా పటిష్ఠంగా, చిరకాలం మన్నేలా ఈ గొలుసుకట్టును పూర్తి చేయగల సరైన యువకులను కనుగొనడమే ఇండియాకు సమస్య కావచ్చు.
ఒకసారి స్వదేశంలోను, మరొకసారి వారి దేశంలోను టెస్ట్ సీరీస్ ఆడడమనేది ఆనవాయితీ కనుక ఈసారి దక్షిణాఫ్రికాలో పర్యటించడం ఇండియా వంతు అయినప్పటికీ మన దేశానికి వచ్చి, ఆడేందుకు అంగీకరించినందుకు దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఇండియా ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంది. 2006లో దక్షిణాఫ్రికాలో ఇండియా ఆడిన తరువాత వారు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆడారు. వారు ఇష్టపూర్వకంగానే సింహం గుహలోకి ప్రవేశించడమే కాకుండా క్రితం సారి వలె సమ ఉజ్జీలమని నిరూపించుకుని తిరిగి వెళుతున్నారు. ఇందుకు ఘనత మన కన్నా వారికే ఎక్కువ దక్కుతుంది.
సుమారు నాలుగు సంవత్సరాల విరామానంతరం ఈ శీతాకాలంలో దక్షిణాఫ్రికాలో ఇండియా ఆడవలసి రావడం అంతర్జాతీయ టెస్ట్ క్యాలెండర్ రూపకర్తల ఆలోచన లేమిని సూచిస్తున్నది. అయితే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో టెస్ట్ సీరీస్ ను ఇండియా గెలుచుకొనగలిగితేనే వారి నంబర్ వన్ ర్యాంక్ మరింత అర్థవంతం అవుతుంది. ఇండియా ఇంత వరకు ఆ రెండు దేశాలలో వారిపై సీరీస్ గెలుచుకొనలేదు.
Pages: -1- 2 News Posted: 20 February, 2010
|