'రారాజు' సచిన్
గ్వాలియర్ : సచిన్ టెండూల్కర్ బుధవారం క్రికెట్ రికార్డు పుస్తకాలను తిరగరాశాడు. వన్ డే క్రికెట్ చరిత్రలో తొలి ద్విశతాన్ని సాధించి తన కీర్తి కిరీటంలో మరొక కలికి తురాయిని చేర్చుకున్నాడు. ఇక క్రికెట్ లోకం టెండూల్కర్ ఫీట్ ను అత్యద్భుత ఘనతగా శ్లాఘించింది. సచిన్ పై ప్రశంసల వర్షం కురిపించిన క్రికెట్ ప్రముఖులలో సునీల్ గవాస్కర్ తలమానికంలా నిలిచారు. టెండూల్కర్ మహోన్నత బ్యాట్స్ మన్ గా నిలిచాడని గవాస్కర్ పేర్కొన్నారు. 'అందులో లవలేశమైనా సందేహం లేదు. ఈ క్రీడలో అతనంతటి మహోన్నత బ్యాట్స్ మన్ మరెవరూ లేరు' అని గవాస్కర్ ప్రశంసించారు.
ఇక ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు, సచిన్ టెండూల్కర్ తో మైదానంలో పోరును ఆనందించిన షేన్ వార్న్ బుధవారం అతని ఇన్నింగ్స్ ను ఆద్యంతం చూసి, తన ట్విట్టర్ పేజ్ లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వచ్చారు. డబుల్ సెంచరీ మైలురాయిని చేరుకోవలసిందిగా మేస్ట్రో సచిన్ ను వార్న్ ప్రోత్సహిస్తూ వచ్చారు.
బ్యాటింగ్ మేస్ట్రో సచిన్ టెండూల్కర్ ను బహుధా ప్రశంసించిన ప్రముఖులలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. వారు సచిన్ ఘనతను 'అత్యద్భుతమైనది'గా కొనియాడారు. ఇక గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో కిక్కిరిసిపోయిన వీక్షకులు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు చార్ల్ లాంగెవెల్ట్ బంతిని ఆఫ్ సైడ్ నెట్టి ఒక పరుగు తీసి మరే క్రికెటరూ సాధించని డబుల్ సెంచరీ సాధించి చరిత్రను సృష్టించడాన్ని తిలకించి ఒక్కుమ్మడిగా హర్షధ్వానాలు చేశారు.
Pages: 1 -2- News Posted: 25 February, 2010
|