'రారాజు' సచిన్ ఈ మైలురాయిని చేరుకోగానే టెండూల్కర్ అలసిపోయినట్లుగా కనిపించినప్పటికీ తాను సెంచరీ చేసినప్పుడల్లా చేసినట్లుగానే తన హెల్మెట్ తీసి ఆకాశం వైపు చూసి, తరువాత కనులు మూసుకుని మౌనంగా ప్రార్థన చేశాడు. టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్ట్రైకర్ దిశ నుంచి వచ్చి అభినందనపూర్వకంగా టెండూల్కర్ తో కరచాలనం చేసి అతనిని హత్తుకున్నాడు. వికెట్ కీపర్ గా అత్యధిక 'డిస్మిసల్స్' రికార్డును సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కూడా మకుటం లేని మహారాజు టెండూల్కర్ వద్దకు వచ్చి కరచాలనం చేశాడు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆమీర్ సోహైల్ ఈ ఘనతకు టెండూల్కర్ ను ప్రశంసిస్తూ, అతని హుందాతనమే అతని విజయానికి దోహదం చేస్తున్నదని అన్నారు. 'సయీద్ అన్వర్ (ఇంతకుముందు అత్యధిక ఒడిఐ వ్యక్తిగత స్కోరు రికార్డును పంచుకున్న పాక్ ఓపెనర్)ను అడిగినట్లయితే, తన రికార్డును టెండూల్కర్ పూర్వపక్షం చేయడం తనకు సంతోషం కలిగిస్తున్నదని చెబుతాడని నా అభిప్రాయం' అని ఆమీర్ సోహైల్ పేర్కొన్నారు. 'టెండూల్కర్ కు ఈ క్రీడ పట్ల ఉన్న గౌప్ప గౌరవమే అతని విజయానికి కారణం' అని సోహైల్ పేర్కొన్నారు.
క్రికెట్ క్రీడలో ఇది ఒక మైలురాయి. కాని టెండూల్కర్ రెండు దశాబ్దాల కెరీర్ లో ఇది మరొక రోజు మాత్రమే. అతను తన కెరీర్ లో ఇప్పటి వరకు 93 సెంచరీలతో సహా సుమారు 30 వేల అంతర్జాతీయ పరుగులు స్కోరు చేశాడు. అతను టెస్టులలో 47, వన్ డే ఇంటర్నేషనల్ పోటీలలో 46 సెంచరీలు నమోదు చేసుకున్నాడు.
Pages: -1- 2 News Posted: 25 February, 2010
|