లాస్ ఏంజెల్స్ : ఆస్కార్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇరాక్ వార్ డ్రామా 'ది హర్ట్ లాకర్' చివరి నిమిషంలో వివాదం రేపింది. అయితే ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకునేందుకు గల అవకాశాలు కూడా దీనికి లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
'ది హర్ట్ లాకర్' ఈ ఏడాది పలు పురస్కారాలు అందుకుని వచ్చే ఆదివారం లాస్ ఏంజెల్స్ లో ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న 82వ అకాడమీ అవార్డుల బరిలో కూడా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'అవతార్' చిత్రానికి ఇది గట్టి పోటీ ఇస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా 'అవతార్'కు వ్యతిరేకంగా 'ది హర్ట్ లాకర్' నిర్మాతల్లో ఒకరైన నికోలస్ చార్టియర్ చేపట్టిన ఇ-మెయిల్ ప్రచారం ఆ సినిమాకు ఆస్కార్ విజేతగా నిలిచే అవకాశాలను సన్నగిల్లేలా చేసింది. అవార్డు రేసులో ఉన్న ఏ చిత్రానికి సంబధించి వ్యతిరేక ప్రచారం (నెగిటివ్ క్యాంపైన్) చేయరాదంటూ అకాడమీ కఠినంగా అమలు చేస్తున్న నిబంధనలకు ఇది విరుద్ధం. నికోలస్ చార్టియర్ నేరుగా 'అవతార్' చిత్రాన్ని ప్రస్తావించనప్పటికీ 500 మిలియన్ డాలర్ల చిత్రానికి కాకుండా 'హర్ట్ లాకర్'కు ఓటు వేయాలంటూ ఆస్కార్ ఓటర్లకు ఇ-మెయిల్స్ పంపారు. దీంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 'అభిశంసన'ను ఈ చిత్రం ఎదుర్కొనే పరిస్థితి తలెత్తింది. జేమ్స్ కామరూన్ సైన్స్ ఫిక్షన్ గా 'అవతార్' రూపొందగా, బాగ్దాద్ లోని యుఎస్ ఆర్మీ బాంబ్ డిస్పోజల్ యూనిట్ కు చెందిన కథాంశంతో వార్ యాక్షన్ ఫిల్మ్ గా 'ది హర్ట్ లాకర్' తెరకెక్కింది.