కపిల్ కు 'హాల్ ఆఫ్ ఫేమ్' దుబాయ్ : భారత వెటరన్ క్రికెట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కపిల్ కు మంగళవారంనాడు 'హాల్ ఆఫ్ ఫేమ్' గుర్తింపునిచ్చింది. ఈ అరుదైన అవకాశానికి గుర్తింపుగా కపిల్ కు 'టోపీ' లభించింది. ఇక్కడి ఐసిసి కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని పొందిన క్లైవ్ లాయిడ్, ఐసిసి అధికారులు, ఆహూతులైన అతిథులు, ఐసిసి సభ్యుల సమక్షంలో కపిల్ కు ఐసిసి అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ ఈ టోపీని బహూకరించారు. క్రికెట్ లో ఉద్దండులైన వారికి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ సిఎ), ఐసిసి సంయుక్తంగా ఈ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని ఇస్తుంటాయి. 1983లో అంతర్జాతీయ వన్డే కప్ ను భారత్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ కెప్టెన్సీలో గెలిచిన విషయం తెలిసిందే. 'హ్యాండ్ క్రాఫ్ట్' తయారీ హాల్ ఆఫ్ ఫేమ్ టోపీని ఐసిసి ప్రెసిడెంట్ బహూకరిస్తూ కపిల్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
'ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కడం చాలా సంతోషంగాను, గర్వంగానూ కూడా ఉంది. నిజానికి నా ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదు. భారత క్రికెట్ లో ఉన్న ఉద్దండులైన క్రీడాకారుల మధ్య నుంచి తనను ఇలాంటి గౌరవానికి ఎంపిక చేస్తారని కలలో కూడా ఊహించలేదు. నాకు చాలా ఆశ్చర్యంగాను, ఆనందంగాను ఉంద'ని కపిల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. 'నేను క్రికెట్ లో తొలి పాఠాలు నేర్చుకునే సమయానికే సునీల్ గవాస్కర్ గొప్ప క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు. క్లైవ్ లాయిడ్, రిచర్డ్ హాడ్లీ, వాసిం అక్రం లాంటి అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారుల సరసన తనకు స్థానం కల్పించడం నిజంగా తన అదృష్టం' అని కపిల్ అన్నాడు.
Pages: 1 -2- News Posted: 9 March, 2010
|